86/6 నుంచి 246 వరకు...

Indian pacers dismiss England for 246 on day 1 - Sakshi

ఇంగ్లండ్‌ను ఆదుకున్న కరన్‌ 

చెలరేగిన భారత పేసర్లు

గత టెస్టులాగే ఈ మ్యాచ్‌ భారత్‌ ఆధిపత్యంతోనే మొదలైంది. కాకపోతే చిన్న మార్పు... ఆ టెస్టు బ్యాటింగ్‌ జోరుతో మొదలైతే, నాలుగో టెస్టు పేస్‌ ప్రతాపంతో ఆరంభమైంది. అయితే కరన్‌ (136 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రెండు కీలక భాగస్వామ్యాలతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. దీంతో తొలి రోజు నుంచే భారత్‌ పట్టు బిగించే అవకాశానికి గండికొట్టాడు.  

సౌతాంప్టన్‌: ఈ సారి భారత బౌలర్ల వంతు... మన పేసర్లంతా ఇంగ్లండ్‌పై ధ్వజమెత్తారు. వాళ్లేమో బ్యాట్లెత్తారు. బౌలింగ్‌ దళం ధాటికి ఒక దశలో మూడో సెషన్‌కు ముందే ఇంగ్లండ్‌ ఆట కట్టేసేలా కనిపించింది. కానీ కరన్‌ అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. ఏ వందకో, 150 స్కోరుకో ముగిసే ఇన్నింగ్స్‌ను దాదాపు 250 పరుగుల దాకా లాక్కొచ్చాడు. పేసర్లు బుమ్రా (3/46), ఇషాంత్‌ శర్మ (2/26), షమీ (2/51)లతో పాటు స్పిన్నర్‌ అశ్విన్‌ (2/40) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. దీంతో నాలుగో టెస్టు మొదలైన రోజే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కరన్, మొయిన్‌ అలీ (85 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరే భారత్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. 39వ టెస్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లి తొలిసారి తుది జట్టును మార్చకుండా కొనసాగించాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ముగిసే సరికి 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.  

పరుగుతో పాటే పతనం... 
ఇంగ్లండ్‌ పతనం తొలి పరుగుతోనే మొదలైంది. మూడో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ జెన్నింగ్స్‌ (0)ను బుమ్రా డకౌట్‌ చేశాడు. తర్వాత కెప్టెన్‌ రూట్‌ (4), బెయిర్‌స్టో (6), కుక్‌ (17), బట్లర్‌ (21), స్టోక్స్‌ (23) ఇలా 35 ఓవర్ల వ్యవధిలో 86 పరుగులకే ఆరుగురు కీలక బ్యాట్స్‌మెన్‌ ఔటయ్యారు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కరన్‌... అలీకి జతయ్యాడు. ఇద్దరు క్రీజ్‌లో కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌నూ కుదుటపరిచారు. ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించాక మొయిన్‌ అలీని అశ్విన్‌ ఔట్‌ చేశాడు. రషీద్‌ (6) త్వరగానే ఔటైనా... బ్రాడ్‌ (17) అండతో కరన్‌ రెచ్చి పోయాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక ధాటిగా ఆడాడు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. వీరిద్దరు 63 పరుగులు జత చేశారు. బ్రాడ్‌ను బుమ్రా ఔట్‌ చేయగా, అశ్విన్‌ బౌలింగ్‌లో కరన్‌ బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top