సంచలనం సృష్టించేనా?

The Indian mens tennis team is in the Davis Cup - Sakshi

నేటి నుంచి ఇటలీతో భారత్‌

డేవిస్‌ కప్‌ పోరుతొలి రోజు రెండు సింగిల్స్‌

కొత్త ఫార్మాట్‌లో మెగా ఈవెంట్‌

కోల్‌కతా: అచ్చొచ్చిన వేదికపై అద్భుతం సృష్టించాలనే లక్ష్యంతో భారత పురుషుల టెన్నిస్‌ జట్టు డేవిస్‌ కప్‌ బరిలోకి దిగుతోంది. మాజీ చాంపియన్‌ ఇటలీతో నేడు మొదలయ్యే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్‌ను నిర్వహిస్తారు. రెండో రోజు తొలుత డబుల్స్‌ మ్యాచ్‌... ఆ తర్వాత రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ ఆండ్రియా సెప్పి (ఇటలీ)తో  129వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌... రెండో సింగిల్స్‌లో ప్రపంచ 129వ ర్యాంకర్‌ మాటియో బెరెటిని (ఇటలీ)తో భారత నంబర్‌వన్, ప్రపంచ 102వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తలపడతారు. ఇటలీ టాప్‌ ర్యాంకర్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న మార్కో సెచినాటోను డబుల్స్‌లో ఆడించాలని ఆ జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ కొరాడో బారాజుటి తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది.

శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సెచినాటో–సిమోన్‌ బొలెలీ (ఇటలీ) ద్వయంతో రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌ జంట ఆడుతుంది. రివర్స్‌ సింగిల్స్‌లో బెరెటినితో రామ్‌కుమార్‌; సెప్పితో ప్రజ్నేశ్‌ తలపడతారు. సొంత గడ్డపై ఆడనుండటం... అదీ ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటులేని పచ్చిక కోర్టులపై మ్యాచ్‌లను నిర్వహించడం భారత్‌కు సానుకూలాంశం. ఇటీవలే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్‌ అదే జోరు కొనసాగించి... డబుల్స్‌లో బోపన్న–దివిజ్‌ జంట మెరిస్తే భారత్‌ సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోవద్దు. వ్యక్తిగత ర్యాంక్‌లతో సంబంధం లేకుండా డేవిస్‌ కప్‌లో పలువురు భారత ఆటగాళ్లు అద్భుత విజయాలు సాధించారు.

 కోల్‌కతా సౌత్‌ క్లబ్‌లోని పచ్చిక కోర్టులపై నిర్వహిస్తున్న ఈ వేదికపై భారత్‌ గెలుపోటముల రికార్డు 8–2తో ఉంది. ఇదే వేదికపై చివరిసారి ఇటలీతో 1985 వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో ఆడిన భారత్‌ 3–2తో విజయాన్ని అందుకుంది. ఓవరాల్‌ ముఖాముఖి రికార్డులో భారత్‌ 1–4తో వెనుకబడి ఉంది. చివరిసారి ఇటలీతో 1998లో వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో తలపడిన భారత్‌ 1–4తో పరాజయం పాలైంది.  ఈ ఏడాది నుంచి డేవిస్‌ కప్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ముందుగా 24 జట్ల మధ్య 12 స్థానాల కోసం క్వాలిఫయర్స్‌ జరుగుతాయి. క్వాలిఫయింగ్‌లో గెలిచిన 12 జట్లు నవంబర్‌ 18 నుంచి 24 వరకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో 18 జట్ల మధ్య జరిగే ఫైనల్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి.

గతేడాది సెమీఫైనల్స్‌ చేరిన క్రొయేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా జట్లతోపాటు ‘వైల్డ్‌ కార్డు’ పొందిన అర్జెంటీనా, బ్రిటన్‌ నేరుగా ఫైనల్స్‌ టోర్నీలో ఆడతాయి. ఫైనల్స్‌ టోర్నీలో 18 జట్లను ఆరు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించి రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్‌ నిర్వహిస్తారు. కొత్త ఫార్మాట్‌ ప్రకారం ఇక నుంచి డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లను ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌’ సెట్స్‌ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్‌ ఆఫ్‌ త్రీ’ సెట్స్‌ పద్ధతిలో ఆడిస్తారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top