భారత క్రికెటర్లకు శుభవార్త!

Indian cricket team to fly business class during home series as well - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు తీయటి కబురును అందించింది బీసీసీఐ. ఇప్పటివరకూ స్వదేశంలో జరిగే సిరీస్ ల్లో భాగంగా సాధారణ ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తూ వస్తున్న భారత్ క్రికెటర్లకు ఇక నుంచి బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే నేతృత్వంలోని క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) స్పష్టం చేసింది. స్వదేశంలో మ్యాచ్ లు జరిగే సమయంలో విమానంలో ప్రయాణించేటప్పుడు తాము అసౌకర్యానికి గురువుతున్నట్లు క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం వల్ల చాలా మంది తోటి ప్రయాణికులు సెల్పీల కోసం ఇబ్బంది పెడుతున్నారని క్రికెటర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కాళ్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా తక్కువగా ఉంటుందని బీసీసీఐకి నివేదించిన ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలోనే విదేశాల్లో పర్యటించేటప్పుడు సమకూర్చే బిజినెస్ క్లాస్ ప్రయాణాన్ని ఇక్కడ కూడా కల్పించాలని కోరారు. దీనికి ఇటీవల జరిగిన సీఓఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సీకే ఖన్నా తెలిపారు.

వాస్తవానికి  విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే టీమిండియా సభ్యులకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. స్వదేశంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే కెప్టెన్, కోచ్ మాత్రం స్వదేశంలోనూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించొచ్చు. దీంతో మిగిలిన క్రికెట్ల అసౌకర్యాన్ని పరిగణనలోనికి తీసుకున్న బీసీసీఐ..జట్టులో సభ్యులైన క్రికెటర్లందరికీ బిజినెస్ క్లాస్ ను సమకూర్చడానికి సుముఖత వ్యక్తం చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top