భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ముందు ఎంతటి లక్ష్యమైనా చిన్నబోతుందని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణుతుంగ అభిప్రాయపడ్డాడు.
శ్రీలంక: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ముందు ఎంతటి లక్ష్యమైనా చిన్నబోతుందని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణుతుంగ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారత్ జట్టులో మొదటి ఆరుగురు ఆటగాళ్లు గెలుపులో కీలక పాత్ర పోషించడంతో భారీ లక్ష్యాలు కూడా చాలా చిన్నవిగా మారిపోతున్నాయని తెలిపాడు. ఈ క్రమంలో వారికి 300-350 లక్ష్యాలు సునాయాసంగా మారాయన్నాడు. ఈ మధ్య జరిగిన మ్యాచ్లను చూస్తే ఇండియా బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో అవగతమవుతుందని తెలిపాడు. రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్ తీసుకురావడంతో భారత బ్యాటింగ్లో అదనపు బలం చేకూరిందని అర్జున్ తెలిపాడు. గతంలో శ్రీలంక ఆటగాడు జయసూర్యను మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్ తీసుకొచ్చి మంచి ఫలితాలు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
ప్రస్తుతం టీమిండియా యువ రక్తంతో తొణికసలాడుతుందని, అన్ని ఫార్మెట్లలోనూ భారత్ విశేషంగా రాణిస్తుందన్నాడు. భారత క్రికెట్ దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్లు జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్నా, కొత్త కుర్రాళ్లు మాత్ర ఆ లోటును కనబడనీయకుండా జట్టుకు సేవలందిస్తున్నారని కొనియాడాడు.