హర్మన్‌ సేన ఏం చేస్తుందో?

India women vs New Zealand :Women World T20 match - Sakshi

వేగంగా ఎదుగుతున్న భారత మహిళా క్రికెట్‌కు ప్రపంచ కప్‌ కల తీరనిదిగానే ఉంది. వన్డేల్లో రెండుసార్లు విశ్వకిరీటం తుది మెట్టుపై చేజారగా, టి20ల్లో దానికి దగ్గరగా కూడా రాలేక పోతోంది. 2009, 2010 ప్రపంచ కప్‌లలో సెమీ ఫైనల్స్‌ చేరడమే ఇప్పటివరకు ఉత్తమం. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ఈసారి ఆశలు రేపుతోంది. టి20లకు తగిన బ్యాట్స్‌మెన్, స్పిన్‌తో మాయ చేసే బౌలర్లు ఉండటమే దీనికి కారణం. 

ప్రొవిడెన్స్‌ (గయానా): టి20 ప్రపంచ కప్‌లో తమ చివరి ఘనత అయిన సెమీఫైనల్‌ను వెస్టిండీస్‌ గడ్డపైనే (2010) అందుకున్న భారత్‌... మరోసారి అదే చోట అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఇక్కడి గయానా నేషనల్‌ స్టేడియంలో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమీ సాటర్‌వెయిట్‌  నాయకత్వంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీలో మొదటి మ్యాచ్‌ కూడా ఇదే. తమకంటే మెరుగైన కివీస్‌ను ఆరంభంలోనే ఢీ కొనడం టీమిండియాకు ఒకింత పరీక్షే. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే హర్మన్‌ ప్రీత్‌ సేన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే, రెండుసార్లు రన్నరప్‌ అయిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతుంది. దానికి అడ్డుకట్ట వేయాలంటే టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చాల్సిందే. ఆ ప్రయాణం స్ఫూర్తితో... 

పేలవమైన టి20 ప్రపంచ కప్‌ రికార్డును సరిదిద్దుకునే క్రమంలో భారత్‌కు గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రదర్శన ప్రేరణ కానుంది. మిథాలీ రాజ్, పూనమ్‌ యాదవ్, కెప్టెన్‌ హర్మన్, స్మృతి మంధాన వంటి అనుభవజ్జులతో పాటు జెమీమా రోడ్రిగ్స్, వికెట్‌ కీపర్‌ తానియా భాటియా, పూజా వస్త్రకర్, తెలుగమ్మాయి అరుంధతీరెడ్డిలతో జట్టు అనుభవజ్ఞులు, యువత కలయికగా ఉంది. అయితే, వీరిలో ఏడుగురు 15 కంటే తక్కువ టి20లు ఆడటం కొంత ప్రతికూలత. హర్మన్, స్మృతి, జెమీమాల భారీ హిట్టింగ్‌కు, మిథాలీ సంయమనం తోడైతే భారీ స్కోరుకు బాటలు పడతాయి.

ముఖ్యంగా ఇటీవల ఇంగ్లండ్‌ లీగ్‌లలో చెలరేగి ఆడిన మంధానపై ఎక్కువ ఆశలున్నాయి. నెమ్మదైన విండీస్‌ పిచ్‌ల కారణంగా బౌలింగ్‌లో స్పిన్నర్లపై భారీ అంచనాలున్నాయి. పూనమ్‌ లెగ్‌ స్పిన్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్‌ల ఎడమ చేతి వాటం స్పిన్‌ కీలకం కానుంది. కానీ, అనుభవశీలి జులన్‌ గోస్వామి రిటైర్మెంట్‌తో పేస్‌ బౌలింగ్‌లో లోటు కనిపిస్తోంది. అరుంధతీ, పూజా వస్త్రకర్, మాన్సి జోషి త్రయం దీనిని ఏమేరకు తీరుస్తుందనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. 
భారత జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), మిథాలీరాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, తానియా భాటియా, వేదా కృష్ణమూర్తి, ఏక్తా బిష్త్, దయాలన్‌ హేమలత, అనూజ పాటిల్, దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్‌ యాదవ్, పూజ వస్త్రాకర్, మాన్సి జోషి, అరుంధతీరెడ్డి   

రాత్రి గం. 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top