ధోనిని ఉంచుతారా? సాగనంపుతారా?

India vs West Indies Squad Selection Focus On Dhoni Future - Sakshi

ముంబై : ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి అనంతరం అందరి దృష్టి సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనిపై పడింది. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారిన సమయంలో వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. దీంతో ధోని భవితవ్యం రేపు తేలనుంది. సెలక్టర్లు ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకు పెడతారా అనే విషయం తెలుసుకోవడానికి అందురూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పర్యటనకు ధోనిని ఎంపిక చేయకుంటే అతడి క్రికెట్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

తొలుత కరేబియన్‌ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావించారు. అయితే కోహ్లి దీనికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అతడి సారథ్యంలోని జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుత తరుణంలో ధోనికి విశ్రాంతి ఇచ్చామన్నా ఎవరూ ఒప్పుకోరు. కోహ్లితో పాటు ధోనికి విశ్రాంతినిస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రస్తుతం సెలక్టర్లకు ఒక్కటే దారి ధోనిని కొనసాగించడమా లేదా పక్కకు పెట్టడమా. శుక్రవారం భేటికానున్న సెలక్టర్ల సమావేశంలో ఇది తేలనుంది. అయితే ధోని, పంత్‌లను ఎంపిక చేసి.. తుదిజట్టులో పంత్‌ను ఆడించాలని భావిస్తోంది. కొంతకాలం పంత్‌కు దిశానిర్దేశం చేసేందుకు ధోనిని ఎంపిక చేయాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం.  

ఇక ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన దినేశ్‌ కార్తీక్‌ను పక్కకు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విండీస్‌ టూర్‌లో నాలుగో స్థానం కోసం యువ ఆటగాళ్లు మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌లను పరిశీలించే అవకాశం ఉంది. జస్ప్రిత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీంతో భువనేశ్వర్‌, మహ్మద్‌ షమీలతో పాటు ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక యువ సంచలనం రిషభ్‌ పంత్‌ టెస్టులకు పక్కాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే వన్డే, టీ20లకు అతడు ఎంపిక అవుతాడా లేదా అనే సందిగ్థత నెలకొంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top