భారత్‌కు ఎదురుందా! 

India VS New Zealand  Last T20 Match - Sakshi

దుర్భేద్యంగా టీమిండియా

తీవ్ర ఒత్తిడిలో కివీస్‌

నేడు ఆఖరి పోరు మ.గం. 12.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

మౌంట్‌మాంగనీ: గతంలో రెండు సార్లు న్యూజిలాండ్‌కు వచ్చినా... పొట్టి సిరీస్‌ నెగ్గని భారత జట్టు ఇప్పుడు ఏకంగా క్లీస్‌స్వీప్‌ చేసేందుకు రెడీగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై వరుస ఓటమిలతో సిరీస్‌ను కోల్పోయిన కివీస్‌ పరువు కోసం పాకులాడుతోంది. నేడు ఇరు జట్ల మధ్య ఆఖరి టి20 పోరు జరగనుంది. ఈ ఫలితంతో వచ్చే నష్టమేమీ లేకపోవడంతో భారత కెప్టెన్‌ కోహ్లి, రాహుల్‌లకు జట్టు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినిచ్చింది. దీంతో పొట్టి ప్రపంచకప్‌ ఏడాది సత్తాచాటుకునేందుకు రిజర్వ్‌ బెంచ్‌కు ఇది సదావకాశం. ఆఖరి పోరుకు ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తుండగా, పంత్‌కు తొలిసారిగా ఇక్కడ గ్లౌవ్స్‌ తొడుక్కునే అవకాశం వచ్చింది.

గత మ్యాచ్‌లో విఫలమైన సంజూ సామ్సన్‌ ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే అయ్యర్, దూబేలు కూడా స్థిరమైన ప్రదర్శనపై దృష్టిపెట్టాలి. పాండేపై ఎవ రికీ ఎలాంటి అనుమానం లేదు. ఇక బౌలింగ్‌లో భారత్‌ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. రెండు ‘టై’ మ్యాచ్‌ల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బౌలర్ల గురించే. షమీ తర్వాత శార్దుల్‌ కూడా నాణ్యమైన డెత్‌ బౌలర్‌గా నిరూపించుకున్నాడు.

ఎలా గెలవాలబ్బా! 
ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. గెలుపు గడపదాకా రెండు సార్లు వచ్చినా... నెగ్గలేకపోవడం జట్టును నిరాశలో ముంచింది. ఇది చాలదన్నట్లు విలియమ్సన్‌ గాయం జట్టుకు మరింత ప్రతికూలంగా మారింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ గెలిపించాల్సిన స్థితిలో బాధ్యతని నిర్వర్తించలేకపోతున్నాడు. ఇది న్యూజిలాండ్‌ జట్టును కలవరపెడుతోంది. అందరూ సమష్టిగా రాణించి భారత జోరుకు బ్రేక్‌వేసి కనీసం పరువు అయినా కాపాడుకోవాలని న్యూజిలాండ్‌ జట్టు ఆశిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top