మన సమరం నేడే ఆరంభం

ICC Cricket World Cup 2019 India vs South Africa Tomorrow at 3 pm - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా

బరిలో దిగనున్న కేదార్‌ జాదవ్‌

చహల్‌ లేదా జడేజా; షమీ లేదా భువనేశ్వర్‌

స్టెయిన్‌ లేకుండానే సఫారీలు

టోర్నీ ప్రారంభమై ఆరు రోజులైంది...అన్ని జట్లు మైదానంలో దిగాయి... ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు జరిగిపోయాయి... చిన్నాచితక సంచలనాలూ నమోదయ్యాయి... అయినా మన అభిమానుల్లో ఆ జోష్‌ లేదు... వారందరి నుంచి ఎదురవుతోంది ఒకటే ప్రశ్న......ఈసారి ప్రపంచ కప్‌లో ఊపు లేదెందుకని?...అంతా సాదాసీదాగా సాగుతుందేమని? దీనికి సమాధానం నేడే దొరకనుంది.

వంద కోట్లమందిపైగా ఆశలను మోస్తూ...  అంచనాలు నిలబెట్టుకుంటామని భరోసా ఇస్తూ...  అదరగొట్టే ఆటతో కప్పు కొట్టుకొస్తామని ఊరిస్తూ... విశ్వ విజేతగా మువ్వన్నెలను రెపరెపలాడిస్తామంటూ... కోహ్లి సారథ్యంలోని భారత్‌ బరిలో దూకనుంది...

మరిక...వినేవారికి వీనుల విందు కళ్లారా చూసేవారికి చూడ ముచ్చట టీవీల ముందు ప్రేక్షకులకు కన్నుల పండుగే! వీరాభిమానులకైతే మజా మజానే! ఇంకెందుకు ఆలస్యం...? ఆసాంతం ఆస్వాదిద్దాం... టీమిండియాకు శుభాభినందనలు చెబుదాం. 

సౌతాంప్టన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ, మన వీరుల ప్రతాపం ఎలా ఉంటుందోనన్న ఊహల్లో విహరిస్తూ, ఎవరెవరు అదరగొడతారని లెక్కలేసుకుంటూ వస్తున్న భారత క్రికెట్‌ అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌ కోసం టీమిండియా పోరాటం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. సౌతాంప్టన్‌ మైదానం వేదికగా విరాట్‌ కోహ్లి సేన తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్‌తో భారత్‌ బల ప్రదర్శనకు దిగనుండగా... పరాజయాలు, ఫామ్‌ లేమితో సఫారీల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వారికిది మూడో మ్యాచ్‌. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్‌ నెగ్గితేనే కానీ కప్‌లో ముందుకెళ్లలేరు. మరోవైపు తుది కూర్పు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్న టీమిండియా తాజాగా ప్రయాణం ప్రారంభించనుంది.

వారిలో ఎవరు?
సౌతాంప్టన్‌లో మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుండటంతో భారత్‌ రెండో ప్రధాన పేసర్‌గా భువనేశ్వర్‌ను ఆడించే యోచనలో ఉంది. టోర్నీలో ఫ్లాట్‌ వికెట్లపై షార్ట్‌ పిచ్‌ బంతులు వేయగల భువనేశ్వర్‌లాంటి బౌలర్లు విజయవంతం అవుతున్నారు. దీంతో షమీ స్థానంలో అతడిని తీసుకునే వీలుంది. ముగ్గురు పేసర్లనూ తీసుకుంటారని వార్తలు వచ్చినా అందుకు పెద్దగా అవకాశం లేదు. రెండో స్పిన్నర్‌ స్థానం కోసం జడేజా, చహల్‌ మధ్య పోటీ నెలకొంది. ఫిట్‌నెస్‌ సాధించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ మైదానంలో దిగడం ఖాయమైంది. స్పిన్‌ కూడా వేయగల అతడి చేరిక జట్టుకు బలాన్నిస్తుంది. ఐదో స్థానంలో ధోనినే రావొచ్చు. 6, 7లో జాదవ్, హార్దిక్‌ ఆడతారు. బ్యాట్‌ దూసే జడేజా, విలువైన పరుగులు చేయగల భువీని లెక్కలోకి తీసుకుంటే మొత్తం 9 మందితో లోతైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ కనిపిస్తోంది.  

కష్టాల దక్షిణాఫ్రికా...
గత మ్యాచ్‌ ప్రారంభంలోనే ఇన్‌గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్‌ స్టెయిన్‌ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్‌ బౌలర్లున్నారు. ఐదో బౌలర్‌ కోటాను మార్క్‌రమ్, డుమిని తదితరులతో భర్తీ చేయాల్సి వస్తోంది. వీరిలో రబడ మాత్రమే పక్కా పేసర్‌. మోరిస్, ఫెలుక్వాయోలకు ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీయగల సత్తా లేదు. బంగ్లాదేశ్‌ చేతిలో సఫారీల ఓటమికి సరైన బౌలింగ్‌ వనరులు లేకపోవడమూ ఓ కారణమైంది. వెటరన్‌ ఆమ్లా తిరిగి రావడం బ్యాటింగ్‌ను పటిష్ట పరుస్తోంది. ఈ జట్టులోనూ 9వ నంబరు స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల వారుండటం గమనార్హం. బౌలింగ్‌లో ఎలాగూ దమ్ము లేదు కాబట్టి... మొదట క్రీజులో దిగితే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని సవాల్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మైదానం ఇలా...
సౌతాంప్టన్‌ మైదానంలో చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 311. మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టే గెలిచింది. ఈ మ్యాచ్‌ల్లో పేసర్లు 6.4 ఎకానమీతో సగటున 58.4 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు 6 ఎకానమీతో సగటున 60.1 పరుగులు ఇచ్చారు.  

ముఖాముఖి రికార్డు
ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్‌ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది.

కమాన్‌ కోహ్లి...
రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కోహ్లి మంచి ఇన్నింగ్సే ఆడాడు. కప్‌ కోసం సంసిద్ధమైనట్లు కనిపించాడు. ఎప్పటిలాగే అతడు భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. మార్చిలో ఆస్ట్రేలియా సిరీస్, తర్వాత ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోని కోహ్లి కప్‌లో రాణిస్తే.. లోతైన బ్యాటింగ్‌ ఆర్డర్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లొచ్చు. అనుకోకుండా ఓపెనర్లు విఫలమైనా పెద్దగా ఇబ్బంది రాదు.

రాహుల్‌... రాహుల్‌...
ఎంతో ఊగిసలాట మధ్య ఎట్టకేలకు నంబ ర్‌–4గా కేఎల్‌ రాహుల్‌ స్థానం ఖాయమైంది. టీవీ షో వివాదం నుంచి తేరుకుని, ఐపీఎల్‌లో సత్తా చాటిన రాహుల్‌... రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ (108)తో తప్పక ఆడించే పరిస్థితి కల్పించాడు. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా వైఫల్యం, గాయం బెడద విజయ్‌ శంకర్‌ను పక్కనపెట్టేలా చేసింది. క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ అయిన రాహుల్‌ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారత్‌ నిశ్చింతగా ఉండొచ్చు.

పిచ్, వాతావరణం
వర్షం కారణంగా క్రితం రోజంతా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. మంగళవారం వర్షం కారణంగా భారత నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కు అంతరాయం కలిగింది. పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా సహకరించే వీలుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే అయినా... చల్లని వాతావరణం మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు.

శుభ సూచకం
మొత్తమ్మీద వన్డే గణాంకాలు చూసినా, కప్‌లో వారిపై గెలుపోటములు చూసినా దక్షిణాఫ్రికా కఠిన ప్రత్యర్థే. సఫారీలపై విజయం అంత తేలిక కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. అంతేకాక, వరుసగా పెద్ద జట్లతో ఆడాల్సిన పరిస్థితుల్లో... దక్షిణాఫ్రికాను తొలి మ్యాచ్‌లోనే ఎదుర్కొనడం సహజంగానే ఒత్తిడి, ఉత్కంఠ రేపుతుంది. కానీ, ఈసారి ప్రత్యర్థిని ముందే దెబ్బతీసి కాలం పరోక్షంగా మనకు మేలు చేసింది.  రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడటంతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో అందుబాటులో లేకపోవడంతో దక్షిణా ఫ్రికా ఒకవిధంగా ఆత్మరక్షణలో పడింది. దీంతో మానసికంగా భారత్‌దే పైచేయిగా ఉంది. ఈ ఆత్మ విశ్వాసంతో మైదానంలో రాణిస్తే టీమిండియాకు శుభారంభమే.

ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌ ఆడబోతుండటం సంతోషంగా ఉంది. ఆలస్యంగా బరిలోకి దిగడం వల్ల మాకు కొంత మేలు జరిగిందనేది వాస్తవం. ఇతర జట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడుతున్నాయి, వాతావరణం ఎలా ఉంటోంది అనేవి పరిశీలించి, ప్రణాళికలు రూపొందించుకోవడానికి అవకాశం దక్కింది. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా మ్యాచ్‌ రోజున ఎలా ఆడతామనేదే ముఖ్యం. మా టీమ్‌ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగల సత్తా అందరిలో ఉంది. పిచ్‌ను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుంది. తొలిసారి ప్రపంచకప్‌లో దేశానికి నాయకత్వం వహిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది.

2015లో టోర్నీ ఆడేటప్పుడు దీని గురించి అసలు ఏమాత్రం ఊహించలేదు. వేరే సిరీస్‌లతో పోలిస్తే ప్రపంచ కప్‌ ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ప్రత్యర్థి జట్టుకు గాయాల సమస్య ఉంది కాబట్టి వారిని బలహీనంగా భావించడం లేదు. మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం. మా బలాన్నే నమ్ముకున్నా. స్టెయిన్‌ నాకు మంచి మిత్రుడు కూడా కాబట్టి అతను టోర్నీకి దూరం కావడం బాధగా అనిపిస్తోంది. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి కొన్ని పాఠాలైతే నేర్చుకున్నాం. ఇంగ్లండ్‌లో పరిస్థితుల దృష్ట్యా తొలి పది ఓవర్లు ఎంతో కీలకం. గత రెండు ప్రపంచకప్‌ల తరహాలో తొలి మ్యాచ్‌లో నేను సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా జట్టు గెలుపు అన్నింటికంటే ముఖ్యం.
– విరాట్‌ కోహ్లి, భారత్‌ కెప్టెన్‌

వరుసగా రెండు ఓటముల తర్వాత బాధ ఉండటం సహజమే. అయితే నాలాంటి సీనియర్లలో ఆత్మవిశ్వాసం లోపిస్తే తొలిసారి ప్రపంచ కప్‌ ఆడుతున్న కొత్త కుర్రాళ్లు మానసికంగా మరింత బేలగా తయారవుతారు. తమపై తామే జాలి పడేలా వారిని వదిలేయలేం. బలమైన మాటలతో వారిలో విశ్వాసం నింపడం ముఖ్యం. లేదంటే జట్టు మొత్తం కుప్పకూలిపోతుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా కష్టపడతాం.

కానీ ఫలితం మా చేతుల్లో లేదు. భారత్‌తో మ్యాచ్‌ను చావోరేవోగా భావించి ఆడమని మావాళ్లకు చెబుతున్నా. స్టెయిన్‌ తప్పుకోవడంతో ఇప్పుడు మాకు బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు కూడా తక్కువగా ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా అతను గాయాలతో బాధపడ్డాడు. కోలుకుంటున్న సమయంలో ఐపీఎల్‌లో ఆ రెండు మ్యాచ్‌లు ఆడకుండా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.
–డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్‌   

తుది జట్లు (అంచనా)
►భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, జాదవ్, ధోని, హార్దిక్, జడేజా/చహల్, కుల్దీప్, భువనేశ్వర్‌/షమీ, బుమ్రా.

►దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), డసెన్, మార్క్‌రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలుక్వాయో, తాహిర్, రబడ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top