టాస్‌ లేకుండానే టెస్టు?

ICC Considering Scrapping Coin Toss In Test Cricket - Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌లో... మరీ ముఖ్యంగా టెస్టుల్లో ‘టాస్‌’ ప్రాధాన్యం అంతాఇంతా కాదు. 1887లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొట్టమొదటి టెస్టు నుంచే ఆతిథ్య జట్టు కెప్టెన్‌ నాణెం ఎగురవేయడం... పర్యాటక జట్టు సారథి తన ఎంపిక చెప్పడం పద్ధతిన టాస్‌ అమల్లో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో పిచ్‌లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానం ఆతిథ్య జట్టుకే ఎక్కువ మేలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో టాస్‌ తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఆలోచనలు చేస్తోంది.

ఈ నెల 28, 29 తేదీల్లో ముంబైలో జరగనున్న సమావేశంలో కమిటీ చర్చించనుంది. అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్‌ మే, న్యూజిలాండ్‌ క్రికెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్, అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో, ఐసీసీ రిఫరీలు రంజన్‌ మదుగలే, షాన్‌ పొలాక్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్‌షిప్‌ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లిష్‌ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్‌ లేకుండా... బ్యాటింగ్, బౌలింగ్‌ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు. గతంలో భారత దేశవాళీ క్రికెట్‌లోనూ దీని అమలు దిశగా ఆలోచించినా ముందడుగు పడలేదు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top