రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు దేశవాళీ వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయింది.
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు దేశవాళీ వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయింది. రంజీల్లో గ్రూప్ ‘సి’కే పరిమితమైన అక్షత్ రెడ్డి బృందం వన్డేల్లో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. సౌత్ జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ రెండు పరాజయాలు చవి చూసింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బుధవారం గోవాతో తలపడనుంది.
అందరూ అందరే...
టోర్నీ తొలి మ్యాచ్‌లో కేరళపై చక్కటి విజయంతో హైదరాబాద్ శుభారంభం చేసింది. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడి మధ్య పటిష్టమైన కర్ణాటకతో ‘టై’ చేసుకోవడంతో జట్టు ప్రదర్శనపై ఆశలు రేకెత్తాయి. అయితే ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నా నిలకడగా ఆడలేకపోయాడు. నాలుగు మ్యాచుల్లో బ్యాట్స్‌మెన్ కేవలం మూడు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశారంటే బ్యాటింగ్ ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాలుగు మ్యాచ్‌లు ఆడిన సుమన్, విహారి, రవితేజలాంటి ప్రధాన ఆటగాళ్లు కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయారు. యువ ఆటగాడు రాహుల్ సింగ్ తనకు దక్కిన అవకాశాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ప్రజ్ఞాన్ ఓజా 8 వికెట్లతో రాణించినా.. బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో అతని ప్రదర్శన పెద్దగా ఉపయోగ పడలేకపోయింది. తమిళనాడు పటిష్టమైన జట్టు అనుకున్నా...బలహీనమైన ఆంధ్ర చేతిలో కూడా ఓడటం హైదరాబాద్ పరిస్థితిని సూచిస్తోంది.
టి20ల్లో రాణిస్తారా...
రంజీ ట్రోఫీ, వన్డేల్లో హైదరాబాద్ ప్రదర్శన పూర్తిగా తీసికట్టుగా ఉంది. అద్భుతమైన మైదానాలు, చక్కటి సౌకర్యాలు ఉన్నా...ఆటలో మాత్రం జట్టు తిరోగమిస్తూనే ఉంది. చిన్న జట్లతో కూడా పోరాటం కనబర్చలేక చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నీలో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనైనా గెలిస్తే పరువు దక్కుతుంది. మరో వైపు దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ నెల 28నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1న జరిగే తొలి మ్యాచ్‌లో కేరళతో హైదరాబాద్ తలపడుతుంది. కనీసం ఆ టోర్నీలోనైనా సౌత్ జోన్‌నుంచి నాకౌట్‌కు అర్హత సాధిస్తే జట్టుకు తగిన గుర్తింపు దక్కుతుంది.