గెలిచే మ్యాచ్‌కు ‘డ్రా’ కార్డు

 Hockey World Cup: India draw with England - Sakshi

ఇంగ్లండ్‌తో భారత్‌ మ్యాచ్‌   1–1తో ‘డ్రా’

మహిళల హాకీ ప్రపంచకప్‌  

మ్యాచ్‌ ముగిసేందుకు ఇక ఆరు నిమిషాలే మిగిలుంది. భారత్‌ 1–0తో ఆధిక్యంలో ఉంది. పెట్టని గోడలా గోల్‌ కీపర్‌ సవిత... దుర్భేద్యమైన రక్షణ శ్రేణి. దీంతో మెగా టోర్నీలో భారత్‌ శుభారంభమే తరువాయి అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా మ్యాచ్‌కు ‘డ్రా’ కార్డు పడింది! ఆతిథ్య ఇంగ్లండ్‌కు ‘డ్రా’నందం మిగిలింది.   

లండన్‌: మహిళల హాకీ ప్రపంచకప్‌లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను భారత జట్టు ఎక్కడికక్కడ కట్టిపడేసింది. భారత్‌ గెలిచేందుకు, మ్యాచ్‌ ముగిసేందుకు దగ్గరైన దశలో ఇంగ్లండ్‌ పెనాల్టీ కార్నర్‌ ప్రయత్నం సఫలమైంది. భారత్‌ 1–1తో ‘డ్రా’ చేసుకోవాల్సి వచ్చింది. ఫలితం చివర్లో అసంతృప్తికి గురిచేసినా... భారత గోల్‌కీపర్‌ సవితా పూనియా, రక్షణ పంక్తి పోరాటం మాత్రం అద్వితీయంగా సాగింది. భారత మహిళల జట్టు అంచనాల కు అందనంతగా పోరాడింది. సరిగ్గా మూడు నెలల క్రితం... గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇదే జట్టు  చేతిలో 0–6తో భారత జట్టు ఓడింది. మూడో స్థానం కోసం వర్గీకరణ పోరులో చెత్తగా ఆడి కాంస్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌ జట్టుకు పదో ర్యాంకులో ఉన్న భారత్‌ ముచ్చెమటలు పట్టించింది.

ప్రతీ క్వార్టర్‌లోనూ రెండు, మూడు పెనాల్టీ కార్నర్‌లు కలిసొచ్చినా ఇంగ్లండ్‌ను కంగుతినిపించే స్థాయికి చేరింది. రెండో క్వార్టర్‌ ముగిసే సమయానికి నేహా గోయల్‌ (25వ ని.) చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే ఇంగ్లండ్‌ ఐదు పెనాల్టీ కార్నర్‌లను సంధించగా భారత డిఫెన్స్, గోల్‌ కీపర్‌ చాకచక్యంగా అడ్డుకున్నారు. చివరి రెండు క్వార్టర్లలో ఇంగ్లండ్‌కు మరో నాలుగు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలొచ్చాయి. ఎట్టకేలకు తొమ్మిదో పెనాల్టీ కార్నర్‌ను 54వ నిమిషంలో లిలీ ఓవ్‌స్లే గోల్‌గా మలచడంతో మ్యాచ్‌ 1–1 స్కోరు సమమైంది. ఈసారీ సవిత సమర్థంగా అడ్డుకున్నా... రీబౌండ్‌ అయిన బంతిని భారత డిఫెండర్‌ దీపిక తప్పించలేకపోయింది. అక్కడే ఉన్న లిలీ గోల్‌పోస్ట్‌లోకి తరలించడంతో మ్యాచ్‌ డ్రా అయింది. 26న రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ ఆడుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top