ఆ క్రికెట్‌ షాట్‌కు పేరేమిటో?

Heinrich Klaasen Steps Outside The Pitch To Hit Yuzvendra Chahal For Four - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: టీమిండియాతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో మెరుపులాంటి ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాను గెలిపించిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. 27 బంతుల్లో 47 పరుగులు సాధించి సఫారీలకు సునాయాస విజయాన్ని అందించాడు. క్లాసెన్‌ హెల్మెట్ పెట్టుకుని ఆడుతుంటే అచ్చం న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గుఫ్టిల్‌ను తలపిస్తాడు.  ఇదిలా ఉంచితే, ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో భారత స్పిన్నర్‌ చాహల్ ఆఫ్‌ స్టంప్ అవతలికి షార్ట్ పిచ్ బంతిని విసరగా.. క్లాసెన్ ఆ బంతిని వెంటాడి మరీ స్వేర్‌లెగ్ వైపు బౌండరీగా మలిచిన తీరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో చర్చగా మారింది.

ఆ షాట్ అచ్చు డివిలియర్స్‌లా ఆడాడని కొందరంటే, మరికొందరేమో క్రేజీ షాట్ అంటున్నారు. సోషల్ మీడియాలో క్లాసెన్ షాట్‌పైనే చర్చ జరుగుతోంది. తన కెరీర్‌లో రెండో వన్డే ఆడిన క్లాసెన్..ఈ వినూత్నమైన షాట్లకు పేరేంటని అడిగితే, అవి బౌండరీ కోసం ప్రత్యేక సందర్భంలో ఆడిన షాట్లన్నాడు. దానికి క్రికెట్‌ పుస్తకాల్లో కానీ, మరెక్కడా కానీ వాటికి పేరు లేదని చెప్పాడు. డీకాక్‌ వరుస వైఫల్యాల కారణంగా జట్టులోకి వచ్చిన క్లాసెన్‌పై టీమిండియా దృష్టిసారించకపోతే తదుపరి వన్డేల్లో అతని నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top