
నాల్గో టెస్టు ఢిల్లీలోనే!
దక్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వచ్చే నెలల జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నెలకొన్నసందిగ్ధతకు దాదాపు తెరపడింది.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వచ్చే నెలల జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నెలకొన్నసందిగ్ధతకు దాదాపు తెరపడింది. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)ను ఆపొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే మ్యాచ్ నిర్వహణపై హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలిన హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నగదు మొత్తంలో సగ భాగాన్ని అంటే రూ.50 లక్షలను రెండు వారాల లోపు డీడీసీఏ చెల్లించాలని తన తీర్పులో పేర్కొంది.
ఆ మొత్తాన్ని చెల్లించడానికి డీడీసీఏ అంగీకారం తెలపడంతో తమ తదుపరి తీర్పు(నవంబర్ 27) వరకూ డీడీసీఏపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ బాదర్ దుర్రేజ్ అహ్మద్, సంజీవ్ సచ్చదేవ్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దీంతో వచ్చే నెల మూడు నుంచి ఏడు వరకూ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నాల్గో టెస్టు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.
తమ ప్రభుత్వానికి వినోదపు పన్ను రూపంలో రావాల్సిన రూ.24.45 కోట్లు చెల్లించాలని డీడీసీఏను అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వినోదపు పన్నును డీడీసీఏ చెల్లించకుండా అవినీతికి పాల్పడిందంటూ ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేసిన డీడీసీఏ హైకోర్టును ఆశ్రయించింది.