హర్భజన్‌ రిస్క్‌ చేస్తున్నాడా?

Harbhajan Risks International Retirement by Entering The Hundred - Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రిస్క్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు కారణం ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌(ఈసీబీ) నిర్వహించనున్న ‘ ద హండ్రెడ్‌’ లీగ్‌ కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది వంద బంతుల క్రికెట్‌ను నిర్వహించడానికి ఈసీబీ రంగం సిద్ధం చేయగా, అందులో హర్భజన్‌ సింగ్‌ పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడని సమాచారం. ద హండ్రెడ్‌ లీగ్‌ను  గురువారం అధికారికంగా లాంచ్‌ చేయగా, పలువురు ఆటగాళ్లు పేర్లు తెరపైకి వచ్చాయి. దీనిలో భాగంగా భారత్‌ నుంచి హర్భజన్‌ సింగ్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ప్రధానంగా భారత పురుష క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లో ఆడటానికి ఇంకా బీసీసీఐ అనుమతి ఇవ్వని నేపథ్యంలో హర్భజన్‌ పేరు రావడం చర్చనీయాంశంగా మారింది.

దీనిలో భాగంగా ద హండ్రెడ్‌ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌ పాల్గొనడానికి తమ నుంచి ఎటువంటి అనుమతులు లేవని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేయడంతో ఈ వెటరన్‌ ఆడటానికి మొగ్గుగా ఉన్నాడని వాదనకు బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ.. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పలేదు. భారత్‌కు జట్టుకు ఆడి దాదాపు మూడేళ్లు అయినప్పటికీ ఇంకా తన రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు హర్భజన్‌. ఒకవేళ హర్భజన్‌ సింగ్‌ ద హండ్రెడ్‌ లీగ్‌లో ఆడదల్చుకుంటే ముందుగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది. అది కూడా వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆరంభానికి ముందే తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అసలు ద హండ్రెడ్‌ లీగ్‌ అంటే ఏమిటి..
క్రికెట్ కొత్త పుంతలు తొక్కించాలనే ప్రయత్నమే ద హండ్రెడ్‌ రావడానికి కారణం. 2020లో నిర్వహించ తలపెట్టిన 8 జట్ల దేశవాళీ టోర్నీలో వంద బంతుల టోర్నీ నిర్వహించాలని ఈసీబీ నిర్ణయించింది. ఈ మేరకు కొంతకాలం క్రితమే తమ నిర్ణయాన్ని వెల్లడించింది. వంద బంతుల ఫార్మాట్‌లో 15 సాధారణ ఓవర్లు ఉంటే.. ఒక్క ఓవర్లో మాత్రం పది బంతులు ఉంటాయి.  ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో ఓవరాల్‌గా 40 బంతులు తక్కువగా వేస్తారు. దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. బంతులు తక్కువగా ఉండటంతో పాటు క్రికెట్‌ మరింత రసవత్తరంగా మారుతుంది.

ఎన్‌ఓసీ ఇంకా కోరలేదు..
తాజా వార్తలపై బీసీసీఐ స్పందించింది. ‘ మా నుంచి హర్భజన్‌ సింగ్‌ ఎటువంటి ఎన్‌ఓసీ సర్టిఫికేట్‌ కోరలేదు.  బీసీసీఐ రూల్స్‌ ప‍్రకారం హర్భజన్‌ సింగ్‌ ఏ లీగ్‌ కోసం పేరును ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే అది బీసీసీఐకి వ్యతిరేకం’ అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్‌ టీ20లో యువరాజ్‌ సింగ్‌ ఆడాడు. అది కూడా అతను అంతర్జాతీయ టీ20 తర్వాత మాత్రమే జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌తో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌కు కూడా యువీ వీడ్కోలు చెప్పడంతోనే విదేశీ లీగ్‌లో ఆడే అవకాశం యువీకి దక్కింది. ఇలా చూస్తూ భజ్జీ కూడా దీన్ని అనుసరించక తప‍్పదు. ద హండ్రెడ్‌లో ఆడాలనుకుంటే మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో పాటు ఐపీఎల్‌ను కూడా వదులుకోవాలి. గత ఐపీఎల్‌లో భజ్జీకి సీఎస్‌కే చెల్లించిన మొత్తం రూ. 2 కోట్లు. అతన్ని కనీస ధరకే సీఎస్‌కే దక్కించుకుంది. అంటే భజ్జీ రిస్క్‌ చేయదలుచుకుంటే ఐపీఎల్‌ ద్వారా సంపాదించే అవకాశాన్ని కోల్పోవాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top