గురుసాయిదత్ సంచలనం | Gurusaidutt, Jayaram cause upsets in Denmark Open | Sakshi
Sakshi News home page

గురుసాయిదత్ సంచలనం

Oct 17 2013 1:06 AM | Updated on Sep 1 2017 11:41 PM

గురుసాయిదత్ సంచలనం

గురుసాయిదత్ సంచలనం

అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత క్రీడాకారులు డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్‌తోపాటు అజయ్ జయరామ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

ఒడెన్స్ (డెన్మార్క్): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత క్రీడాకారులు డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్‌తోపాటు అజయ్ జయరామ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... రైజింగ్ స్టార్ పి.వి.సింధు, అరుంధతి తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు.
 
 ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న 23 ఏళ్ల గురుసాయిదత్ సంచలన విజయంతో ముందంజ వేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ హూ యున్ (హాంకాంగ్)తో జరిగిన తొలి రౌండ్‌లో గురుసాయిదత్ 21-17, 21-14తో గెలిచాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇండియన్ ఓపెన్‌లో హూ యున్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు.
 
 
  39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని గెలవడం విశేషం. రెండో గేమ్‌లోనైతే గురుసాయిదత్ 9-10తో వెనుకబడి దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా 11 పాయింట్లు గెలిచాడు. మరోవైపు ప్రపంచ 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్ కూడా సంచలన ప్రదర్శన కనబరిచి 21-11, 21-14తో ప్రపంచ 8వ ర్యాంకర్ బూన్‌సక్ పొన్సానా (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించాడు. 32 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో జయరామ్ స్మాష్‌లతో 19 పాయింట్లు, నెట్‌వద్ద 11 పాయింట్లు గెలుపొందాడు. ప్రపంచ 16వ ర్యాంకర్ డారెన్ లూ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ కశ్యప్ తొలి గేమ్‌లో 11-4తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా డారెన్ లూ వైదొలిగాడు.
 
 మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రపంచ 64వ ర్యాంకర్ స్టెఫానీ (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్‌లో సైనా కేవలం 27 నిమిషాల్లో 21-16, 21-12తో విజయం సాధించింది. మరోవైపు ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు తొలి రౌండ్‌లోనే చేతులెత్తేసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్)తో జరిగిన పోరులో సింధు 19-21, 20-22తో ఓటమి చవిచూసింది. హిరోస్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర అమ్మాయి అరుంధతి 17-21, 15-21తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయింది.
 
 పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 14-21, 14-21తో మైకేల్ ఫుక్స్-ష్కోట్లెర్ (జర్మనీ) జోడి చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప-కోనా తరుణ్ జంట 14-21, 13-21తో యోంగ్ డే లీ-చాన్ షిన్ (దక్షిణ కొరియా) జోడి చేతిలో ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement