నా ఆట చూడకపోవడం అదృష్టం!

నా ఆట చూడకపోవడం అదృష్టం!


ఢిల్లీ:రాహుల్ ద్రవిడ్.. మిస్టర్ డిఫెండబుల్, ద వాల్గా గుర్తింపు తెచ్చుకుని భారత్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన మాజీ క్రికెటర్. ఇప్పుడు భారత క్రికెట్‌కు  రాహుల్ ద్రవిడ్ ఓ గురువు. చటేశ్వర పుజారా కావచ్చు లేదా రహానే కావచ్చు...యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇలా చాలామంది ఆటపై ద్రవిడ్ ప్రభావం ఉంది. ప్రస్తుతం టీమిండియా 'ఎ' జట్టుకు కోచ్ గా ఉన్న ద్రవిడ్.. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్ ల పై జోక్ వేసి అందర్నీ ఆకట్టుకున్నాడు ద్రవిడ్. గురువారం గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ 97 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 43 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగి ఆడి ఢిల్లీకి ఘనమైన విజయాన్ని అందించాడు.అతనికి సంజూ శాంసన్(61 పరుగులు) కూడా చక్కటి సహకారం అందివ్వడంతో ఢిల్లీ సునాయసంగా విజయం సాధించింది.



అయితే వీరి బ్యాటింగ్ కు ముగ్ధుడైన ద్రవిడ్.. తన బ్యాటింగ్ ను పోల్చుకుంటూ సరదాగా జోక్ వేశాడు. ' గుజరాత్ తో మ్యాచ్ లో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ల ఆట తీరు ఆకట్టుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారిద్దరి ఆట అసాధారణంగా ఉంది. నా బ్యాటింగ్ వీడియోలు చూసే ఇలా ఆడటం నేర్చుకున్నట్లు ఉన్నారు(నవ్వుతూ). నేను ఎప్పుడూ ఇదే తరహాలో దూకుడుగా బ్యాటింగ్  చేసేవాడిని(నవ్వుతూనే)'అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. అయితే భారీ లక్ష్యాల్ని సైతం సునాయాసం చేసిన రిషబ్ పంత్, సంజూ శాంసన్ లు తన వీడియోలు ఎక్కువగా చూడనందుకు అభినందిస్తున్నానంటూ మళ్లీ ద్రవిడ్ జోక్ పేల్చాడు. 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే వారు కచ్చితంగా తన బ్యాటింగ్ వీడియోలో చూసి ఉండరని ద్రవిడ్ నవ్వులు పూయించాడు. దాంతో పక్కనే ఉన్న రిషబ్ పంత్, శాంసన్ లు సైతం తమ పెదవులపై నవ్వును ఆపుకోలేకుండా ఉండలేకపోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top