కోహ్లి తర్వాతే అతనే సరైనోడు..!

Gautam Gambhir Comments On Virat Kohli IPL Captaincy - Sakshi

న్యూఢిల్లీ : ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కోహ్లిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌ కెప్టెన్సీ ధోని, రోహిత్‌తో కోహ్లిని పోల్చలేమంటూ స్పష్టం చేశారు. రోహిత్‌ సారథ్యంలోని ముంబై జట్టు 4 సార్లు, ధోని సారథ్యంలోని చెన్నై జట్టు 3 సార్లు ఐపీల్‌ విజేతగా అవతరించాయని గుర్తు చేశాడు. కానీ, ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారిగా ఐపీఎల్‌ టైటిల్‌ సాధించలేదని అన్నాడు. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా ఫెయిల్‌ అయ్యాడని వివరించారు. 2016లో ఫైనల్‌ చేర్చడం మినహా ఆర్సీబీకి కోహ్లి ఏమీ చేయలేకపోయాడని ఎద్దేవా చేశాడు. ఇక ముంబై జట్టుకు రోహిత్‌ సరైనోడని కితాబిచ్చాడు. ‘నాకు తెలిసి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మాత్రమే. ఇక ఆసియా కప్పులోనూ రోహిత్‌ కెప్టెన్సీ నిరూపించుకున్నాడు. భారత జట్టును విజేతగా నిలిపాడు. రాబోయే రోజుల్లో కోహ్లి తర్వాత భారత జట్టును నడిపించేది రోహిత్‌ శర్మానే’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
(చదవండి : ముంబై చార్‌మినార్‌)

ఇక స్టార్‌ ఆటగాళ్లున్నప్పటికీ ఐపీఎల్‌-12 సీజన్‌లో ఆర్సీబీ 11 పాయింట్లు మాత్రమే సాధించి లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. ఫైనల్‌లో చెన్నైతో తలపడిన ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో ధోని సేనపై విజయం సాధించి ఐపీఎల్‌ కప్‌ను నాలుగోసారి ఎగరేసుకుపోయింది. ఇక తాజా వరల్డ్‌కప్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో మరో నాణ్యమైన బౌలర్‌ ఉంటే బాగుండేదని గంభీర్‌ ఇదివరకే అభిప్రాయపడ్డాడు. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌కు తోడుగా మరో ఫాస్ట్‌ బౌలర్‌ ఉంటే బాగుండేదన్నాడు. ఆల్‌రౌండర్లు హర్దిక్‌, విజయ్‌ శంకర్‌ ఫాస్ట్‌ బౌలర్లు అయినప్పటికీ టీమిండియాలో ఇంకో ఫాస్ట్‌ బౌలర్‌ ఉండాల్సిందని చెప్పాడు. తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గౌతమ్‌ గంభీర్‌ పోటీచేసిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top