‘‘యువ’భారత్‌ ప్రవర్తన పరమ చెత్తగా ఉంది’

Former Team India Captain Bishan Singh Bedi Slams India Under 19 Behaviour - Sakshi

న్యూఢిల్లీ : అండర్‌-19 ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లా, భారత్‌ ఆటగాళ్ల ఘర్షణపై టీమిండియా మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ స్పందించారు. యువ భారత్‌ ఆటగాళ్ల ప్రవర్తన అసహ్యకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ఏ జట్టయినా చెత్త ప్రదర్శన చేయొచ్చు. ఇంత చెత్తగా తిట్టుకోవడం మాత్రం ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఎప్పుడూ చూడని దృశ్యాలు ఫైనల్‌ మ్యాచ్‌లో ‘చూపించారు’అని ఎద్దేవా చేశాడు.
(చదవండి : ‘అతి’కి సస్పెన్షన్‌ పాయింట్లు)

‘ఏ జట్టయినా చాలా చెత్తగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేయొచ్చు. కానీ ఇంత చెత్తగా మాత్రంగా ప్రవర్తించకూడదు. ఇది చాలా అవమానకరమైన, అసహ్యకరమైన ప్రవర్తన’ బంగ్లా ఏం చేసిందో, ఎలా ఆడిందో అది వారి సమస్య. మనోళ్లు ఎలా ఆడారో అది మన సమస్య. కానీ, బండ బూతులు తిట్టుకోవడమేంటి..!’అని బిషన్‌ సింగ్‌ ఆసహనం వ్యక్తం చేశాడు. ఇక తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి కప్పు కొట్టింది. అయితే, విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఫీల్డ్‌ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం అక్కడితో ముగిసింది.

ఐదుగురిపై చర్యలు..
అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్‌–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్‌ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లపై,  దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్‌ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్‌ సింగ్‌కు 8 సస్పెన్షన్‌ పాయింట్లు (6 డి మెరిట్‌ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్‌ (2 డి మెరిట్‌) పాయింట్లు విధించారు.

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లలో తౌహిద్‌ హ్రిదోయ్‌ (10 సస్పెన్షన్‌=6 డి మెరిట్‌), షమీమ్‌ హుస్సేన్‌ (8 సస్సెన్షన్‌=6 డి మెరిట్‌), రకీబుల్‌ హసన్‌ (4 సస్పెన్షన్‌= 5 డి మెరిట్‌)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్‌ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్‌ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top