మాజీ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

Former Cricketer Gulam Bodi Sentenced To 5 Years In Prison - Sakshi

కేప్‌టౌన్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గులామ్‌ బోడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక దేశవాళీ మ్యాచ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశాడని అభియోగాలు ఎట్టకేలకు రుజువు కావడంతో అతనికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల కింద జైలు శిక్ష అనుభవించబోతున్న తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా బోడి నిలిచాడు. 2015లో రామ్‌స్లామ్‌ టీ20 దేశవాళీ టోర్నమెంట్‌లో బోడి ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.ఫలితంగా సఫారీ క్రికెట్‌ బోర్డు అతనిపై 20 ఏళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా తరఫున రెండు వన్డేలు ఆడిన బోడి.. క్రికెటర్‌గా రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత కామెంటేటర్‌ అవతారం ఎత్తాడు. ఆ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్లకు డబ్బులు ఆఫర్‌ చేశాడు. అల్వీరో పీటర్సన్‌ అనే క్రికెటర్‌కు ఫిక్సింగ్‌ చేయమని నగదు ఆశ చూపాడు.

అతను కాస్తా విషయం బయటపెట్టడంతో బోడిపై విచారణ చేపట్టారు. దాంతో అతనిపై రెండు దశాబ‍్దాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, 2018 నవంబర్‌ నెలలో పోలీసులకు బోడి పోలీసులకు లొంగిపోగా, తాజాగా అతనికి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. బోడికి జైలు శిక్షను ఖరారు చేయడంతో అల్వీరో పీటర్సన్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించాడు. క్రికెట్‌కు మంచి రోజులు వచ్చాయంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ హాన్సీ క్రోనేపై కూడా ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు విచారణ దశలో ఉండగానే క్రానే విమాన ప్రమాదంలో మృతిచెందాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top