ఫిరోజ్‌ షా కాదు ఇక..

Feroz Shah Kotla Stadium Renames as Arun Jaitley Stadium - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ స్మారకార్థం ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానానికి ‘అరుణ్‌ జైట్లీ స్టేడియం’అని అధికారికంగా నామకరణం చేశారు. గురువారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన నూతన నామకరణ మహోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్‌ షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారథి విరాట్‌ కోహ్లి అతడి సతీమణి అనుష్క శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు అరుణ్‌ జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  

ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)కు అరుణ్‌ జైట్లీ సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించారు. డీడీసీఏతో పాటు బీసీసీఐలో పలు బాధ్యతలు, హోదాలను నిర్వహించారు. అయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఢిల్లీ క్రికెట్‌లో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జైట్లీ మరణాంతరం ఆయన గుర్తుగా ఫిరోజ్‌ షా కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించింది. అయితే గ్రౌండ్‌కు మాత్రం పాత పేరునే కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. కాగా, అరుణ్‌ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయికి వచ్చామని వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి, అశిష్‌ నెహ్రా వంటి క్రికెటర్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top