31 రోజులపాటు అభిమానులను ఉర్రూతలూగించిన యూరోకప్ ముగిసింది. తొలిసారి 24 జట్లతో భారీఎత్తున జరిగిన ఈ టోర్నీ క్రీడా ప్రేమికులకు అంతులేని వినోదాన్ని పంచింది. ఆతిథ్య ఫ్రాన్స్కు షాకిస్తూ తొలిసారి తమ ఫుట్బాల్ చరిత్రలో మేజర్ టోర్నీని నెగ్గిన పోర్చుగల్ ఆ దేశ ప్రజలకు మర్చిపోలేని బహుమతినిచ్చింది. టోర్నీలో ఎన్నో సంఘటనలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. వాటిలో టాప్ మూమెంట్స్ మరొక్కసారి గుర్తుచేసుకుందాం..
మెరిసిన రొనాల్డో..
టోర్నీలో అంతంతమాత్రం ఆటతోనే సెమీస్కు చేరిన పోర్చుగల్ను కెప్టెన్ రొనాల్డో అద్భుత ఆటతో ఫైనల్కు చేర్చాడు. సెమీస్లో వేల్స్ పై 2-0తో పోర్చుగల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మిడ్ఫీల్డ్, ఫార్వర్డ్ లైన్లో మెరుపులా కదిలాడు. మ్యాచ్లో తొలిగోల్ సాధించడంతోపాటు, గోల్ సాధించేందుకు సహచరుడికి పాస్ అందించాడు.
పోర్చుగల్ సాధించింది..
ఇప్పటివరకు ఒక్క మేజర్ టోర్నీని కూడా నెగ్గలేకపోయామన్న బాధతో ఉన్న పోర్చుగల్కు ఈ టోర్నీ మరుపురాని అనుభూతిని మిగిల్చింది. ఫైనల్లో 1-0తో ఆతిథ్య ఫ్రాన్స్కు షాకిస్తూనెగ్గిన పోర్చుగల్ తమ ఫుట్బాల్ చరిత్రలో తొలిసారి మేజర్ టోర్నీని చేజిక్కించుకుంది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో గాయం కారణంగా మ్యాచ్ 25వ ని.లోనే మైదానం వీడినా పోర్చుగల్ ఆటగాళ్లు వెనకడుగు వేయలేదు. తమ దేశ ప్రజలతోపాటు, ఇన్నాళ్లు జట్టును ముందుండి నడిపించిన దిగ్గజ ఆటగాడు రొనాల్డోకు కూడా ఆ జట్టు ఆటగాళ్లు యూరోకప్ రూపంలో మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు.
ఇంగ్లండ్-రష్యా అభిమానుల గొడవ..
యూరోకప్ మొదలైన రెండోరోజే అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్ 11న ఇంగ్లండ్, రష్యా మధ్య గ్రూప్ మ్యాచ్ సందర్భంగా రెండుజట్లకు చెందిన అభిమానుల మధ్య గొడవలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. మార్సెల్లే నగర వీధుల్లో జరిగిన గొడవల కారణంగా దాదాపు 33 మంది గాయపడ్డారు. మైదానంలో మ్యాచ్ అనంతరం కూడా గొడవలు జరిగాయి. యూరప్ ఫుట్ బాల్ సంఘం ఈ ఘటనను సిరీయస్గా తీసుకోవడంతో పాటు కొంతమంది రష్యా అభిమానులను ఫ్రాన్స్ నుంచి పంపివేసింది.
అతి పెద్ద వయస్కుడు..
హంగేరీ తరఫున టోర్నీలో బరిలోకి దిగిన గోల్ కీపర్ గాబర్ కిరాలీ టోర్నీలో కొత్త రికార్డు నెలకొల్పాడు. జూన్ 14న ఆ జట్టు ఆస్ట్రియాతో తొలి గ్రూప్ మ్యాచ్ ఆడే సమయానికి టోర్నీలో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా 40 ఏళ్ల 75 రోజుల కిరాలీ రికార్డుల్లోకెక్కాడు. ఆ తర్వాత ప్రిక్వార్టర్స్లో బెల్జియంతో హంగేరీ తలపడడంతో ఆయన రికార్డు 40 ఏళ్ల 87 రోజులకు చేరింది.
సూపర్ స్టార్ రిటైర్మెంట్..
యూరప్ సూపర్ స్టార్లలో ఒకడైన జ్లతాన్ ఇబ్రహీమోవిచ్ టోర్నీ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. స్వీడన్ కెప్టెన్ గా ఉన్న జ్లతాన్.. యూరోనే తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ కాబోతుందని, తమ జట్టుకు మూడోదైన చివరి గ్రూప్ మ్యాచ్ సందర్భంగా చెప్పాడు. బెల్జియం చేతిలో ఓడిన స్వీడన్.. గ్రూప్ దశలో చివరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దేశం తరఫున 15 ఏళ్ల కెరీర్లో 116 మ్యాచ్ లలో 62 గోల్స్ చేసిన 34 ఏళ్ల జ్లతాన్.. స్వీడన్ నుంచి ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
అభిమానుల ఓవరాక్షన్..
క్రొయేషియా అభిమానుల ఓవరాక్షన్ ఆ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గ్రూప్ దశలో ఆ జట్టు రెండో మ్యాచ్ సందర్భంగా అభిమానులు మైదానంలోకి ఫ్లేర్స్ (మంటలు పుట్టించే సాధనాలు) విసిరారు. రెండో అర్ధభాగంలోఈ ఘటన చోటు చేసుకోగా.. మ్యాచ్ కాసేపు నిలిపి అనంతరం కొనసాగించారు. అయితే ఆసక్తికర ఆంశమేమిటంటే చెక్ రిపబ్లిక్ తో జరిగిన ఆ మ్యాచ్లో అప్పటికి క్రొయేషియా 2-1తో ఆధిక్యంలో ఉంది. విరామం అనంతరం ఏకాగ్రత కోల్పోయిన క్రొయేషియా ఆటగాళ్లు 89వ నిమిషంలో చెక్కు పెనాల్టీ సమర్పించుకున్నారు. దాంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.
డిఫెండింగ్ చాంపియన్కు పంచ్..
గత రెండు సీజన్లుగా టైటిల్స్ నెగ్గుతూ వస్తున్న స్పెయిన్కు ఈసారి ప్రిక్వార్టర్స్ లోనే షాక్ తగిలింది. గత సీజన్లో తమను ఫైనల్లో ఓడించిన స్పెయిన్కు ఇటలీ జట్టు ఈసారి ప్రిక్వార్టర్స్లోనే ఇంటిదారి చూపింది. చక్కటి ఆటతీరుతో టోర్నీలో తమ పునర్వైభవాన్ని చాటిన ఇటలీ 2-0తో స్పెయిన్ను చిత్తుచేసింది. వరుసగా రెండుసార్లు యూరోకప్ను నెగ్గి రికార్డు సృష్టించిన స్పెయిన్ రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది.
గ్రిజ్మన్ డబుల్..
టోర్నీ ద్వారా సూపర్ స్టార్గా మారిన ఆటగాడు గ్రిజ్మన్. ఫ్రాన్స్ స్ట్రైకర్ గ్రిజ్మన్ టోర్నీలో 6 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలవడంతోపాటు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సెమీస్లో ప్రపంచ చాంపియన్ జర్మనీని ఫ్రాన్స్ ను 2-0తో ఓడించడంతో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో రెండు గోల్స్ గ్రిజ్మన్ సాధించాడు. ఒకే టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానం సంపాదించాడు.
వేల్స్ 'డ్రీమ్ రన్'..
ఇంగ్లండ్ నీడలో ఇన్నాళ్లు ఉంటూ వస్తున్న వేల్స్ ఈ టోర్నీ ద్వారా ప్రపంచ ఫుట్బాల్ పై తమ ముద్రను స్పష్టంగా వేసింది. తాము ఏ మాత్రం చిన్న జట్టు కాదని ఈ టోర్నీతో నిరూపించింది. గ్రూప్ దశలో రెండు విజయాలతో గ్రూప్ టాపర్ గా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఆ గ్రూప్ లోనే ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలవడం విశేషం. ప్రిక్వార్టర్స్ లో నార్తర్న్ ఐర్లాండ్ పై 1-0తో గెలిచింది. క్వార్టర్స్లో టోర్నీ ఫేవరెట్, సూపర్ స్టార్లతో కళకళలాడుతున్న బెల్జియంను 3-1తో చిత్తుచేసి సెమీస్ చేరింది. స్టార్ ఆటగాళ్లు గెరాత్ బేల్, రామ్సే, జో అలెన్ జట్టును ముందుండి నడిపించారు.
ఐస్లాండ్ సంచలనం..
ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ఐస్లాండ్ సంచలనం సృష్టించింది. పోర్చుగల్, హంగేరీలతో గ్రూప్ మ్యాచ్లను డ్రాగా ముగించింది. అలాగే ఆస్ట్రియాపై నెగ్గి గ్రూప్లో రెండోస్థానంలో నిలిచి ప్రిక్వార్టర్స్ కు చేరింది. అక్కడ ఇంగ్లండ్ ను 2-1తో ఓడించి టోర్నీలో అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. క్వార్టర్స్ లో ఫ్రాన్స్ చేతిలో 5-2తో ఓడినా.. తనదైన ముద్రవేసి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
గోల్ కీపర్లకు పరీక్ష..
ఒకవైపు దిగ్గజ గోల్ కీపర్ బఫన్.. మరోవైపు ప్రస్తుత తరం స్టార్ గోల్ కీపర్ నోయర్.. యూరోకప్ క్వార్టర్స్లో ఇటలీ, జర్మనీ మధ్య మ్యాచ్ వీరిద్దరికి పరీక్షలా మారింది. రెండు పెద్ద జట్లు తలపడిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ స్కోరు 1-1తో సమంగా కాగా.. పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఏకంగా 18 షాట్ల షూటౌట్ జరగగా.. 6-5 స్కోరుతో జర్మనీ నెగ్గి సెమీస్ చేరింది. షూటౌట్లో ఇద్దరు గోల్ కీపర్లు ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్లు సైతం పెనాల్టీలను మిస్ చేయడం విశేషం.