euro cup 2016
-
ఆ సంచలన గోల్ సీక్రెట్ ఇదే!
► హైపోక్సిక్ చాంబర్లో సాధన ► రొనాల్డో బాటలో యోగేశ్వర్ న్యూఢిల్లీ: యూరో కప్ లో వేల్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన హెడర్ (గోల్) గుర్తుందా! వాయు వేగంతో దూసుకొచ్చిన బంతిని 8 అడుగుల ఏడు అంగుళాలు పైకి ఎగిరి తలతో గోల్ పోస్ట్ లోకి పంపాడు. మామూలుగా ఇలాంటి సంఘటనల్లో బంతి తగలడమే గొప్ప. కానీ అంత ఎత్తుకు ఎగిరి... అంత బలంగా కొట్టాడంటే...! చూడటానికి ఇది సహజంగా కనిపించినా.. దీని వెనుక ఉన్న మంత్ర దండం మాత్రం ‘హైపోక్సిక్ చాంబర్’. మామూలుగా ఓ చిరుత పరుగు తీయడానికి కూడగట్టుకునే శక్తికి ఐదు రెట్లు ఎక్కువగా రొనాల్డో ఈ షాట్ కోసం ఉపయోగించాడు. అంతేకాదు ఆ షాట్ కొట్టడానికి అతను 0.8 సెకన్లు గాల్లో వేలాడాడు. అసలు ఇది ఎలా సాధ్యమంటే..! మాడ్రిడ్ లోని తన ఇంట్లో ఉండే ఈ హైపోక్సిక్ చాంబర్లో రొనాల్డో ప్రతి రోజూ చేసే కసరత్తులే కారణమట. దీనివల్ల ఫిట్నెస్, శరీరంలోని శక్తి, సహనం గణనీయంగా మెరుగుపడటం, గాయాల నుంచి తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అలాగే రక్తంలోని ఆక్సిజన్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంటే గాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నా శరీరంలోని కార్డియో రెస్పిరేటరి వ్యవస్థ అత్యంత మెరుగ్గా కండరాలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా అథ్లెట్‌కు అలసట పెద్దగా తెలియదు. దీంతో ప్రదర్శన అమోఘంగా మెరుగుపడుతుంది. సీన్ కట్ చేస్తే రియో ఒలింపిక్స్ నేపథ్యంలో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా ఇప్పుడు ఈ చాంబర్లోనే శిక్షణ మొదలుపెట్టాడు. సోనెపట్‌లోని సాయ్ సెంటర్లో జూన్ 28న ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయించుకున్నాడు. సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో వాతావరణం ఎలా ఉంటుందో ఈ చాంబర్లో అలా ఉంటుంది. ఇప్పుడు మన రెజ్లర్ రోజుకు ఓ గంట అందులో ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు. హైపోక్సిక్ చాంబర్ ఇలా ఉంటుంది... మామూలుగా ఓ జిమ్ లోకి గాలి చొరబడకుండా చేస్తే ఎలా ఉంటుందో ఈ హైపోక్సిక్ చాంబర్ అలాగే ఉంటుంది. ఇందులో ఉత్పత్తి అయ్యే ఆవిరి వలన ఎత్తైన వాతావారణంలో ఉన్నట్లు ఉంటుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి క్రమంగా తగ్గుతుండటం అథ్లెట్ కార్డియో రెస్పిరేటరి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అప్పుడు ఈ వ్యవస్థ అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ను చాలా సమర్థంగా వినియోగించుకుంటుంది. తక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఫిట్నెస్, శక్తి, ఓర్పు, దీనివల్ల అథ్లెట్ ఫిట్ నెస్, సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లు గాట్లిన్, ఉసెన్ బోల్ట్, టైసన్ గే, బాక్సింగ్ ఛాంపియన్లు మేవెదర్, పకియానో ఈ చాంబర్లోనే తమ కసరత్తులు చేస్తారు. -
యూరో సంగ్రామం ఇలా జరిగింది
31 రోజులపాటు అభిమానులను ఉర్రూతలూగించిన యూరోకప్ ముగిసింది. తొలిసారి 24 జట్లతో భారీఎత్తున జరిగిన ఈ టోర్నీ క్రీడా ప్రేమికులకు అంతులేని వినోదాన్ని పంచింది. ఆతిథ్య ఫ్రాన్స్‌కు షాకిస్తూ తొలిసారి తమ ఫుట్‌బాల్ చరిత్రలో మేజర్ టోర్నీని నెగ్గిన పోర్చుగల్ ఆ దేశ ప్రజలకు మర్చిపోలేని బహుమతినిచ్చింది. టోర్నీలో ఎన్నో సంఘటనలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. వాటిలో టాప్ మూమెంట్స్ మరొక్కసారి గుర్తుచేసుకుందాం.. మెరిసిన రొనాల్డో.. టోర్నీలో అంతంతమాత్రం ఆటతోనే సెమీస్‌కు చేరిన పోర్చుగల్‌ను కెప్టెన్ రొనాల్డో అద్భుత ఆటతో ఫైనల్‌కు చేర్చాడు. సెమీస్‌లో వేల్స్ పై 2-0తో పోర్చుగల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మిడ్‌ఫీల్డ్, ఫార్వర్డ్ లైన్లో మెరుపులా కదిలాడు. మ్యాచ్‌లో తొలిగోల్ సాధించడంతోపాటు, గోల్ సాధించేందుకు సహచరుడికి పాస్ అందించాడు. పోర్చుగల్ సాధించింది.. ఇప్పటివరకు ఒక్క మేజర్ టోర్నీని కూడా నెగ్గలేకపోయామన్న బాధతో ఉన్న పోర్చుగల్‌కు ఈ టోర్నీ మరుపురాని అనుభూతిని మిగిల్చింది. ఫైనల్లో 1-0తో ఆతిథ్య ఫ్రాన్స్‌కు షాకిస్తూనెగ్గిన పోర్చుగల్ తమ ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి మేజర్ టోర్నీని చేజిక్కించుకుంది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో గాయం కారణంగా మ్యాచ్ 25వ ని.లోనే మైదానం వీడినా పోర్చుగల్ ఆటగాళ్లు వెనకడుగు వేయలేదు. తమ దేశ ప్రజలతోపాటు, ఇన్నాళ్లు జట్టును ముందుండి నడిపించిన దిగ్గజ ఆటగాడు రొనాల్డోకు కూడా ఆ జట్టు ఆటగాళ్లు యూరోకప్ రూపంలో మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. ఇంగ్లండ్-రష్యా అభిమానుల గొడవ.. యూరోకప్ మొదలైన రెండోరోజే అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్ 11న ఇంగ్లండ్, రష్యా మధ్య గ్రూప్ మ్యాచ్ సందర్భంగా రెండుజట్లకు చెందిన అభిమానుల మధ్య గొడవలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. మార్సెల్లే నగర వీధుల్లో జరిగిన గొడవల కారణంగా దాదాపు 33 మంది గాయపడ్డారు. మైదానంలో మ్యాచ్ అనంతరం కూడా గొడవలు జరిగాయి. యూరప్ ఫుట్ బాల్ సంఘం ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకోవడంతో పాటు కొంతమంది రష్యా అభిమానులను ఫ్రాన్స్ నుంచి పంపివేసింది. అతి పెద్ద వయస్కుడు.. హంగేరీ తరఫున టోర్నీలో బరిలోకి దిగిన గోల్ కీపర్ గాబర్ కిరాలీ టోర్నీలో కొత్త రికార్డు నెలకొల్పాడు. జూన్ 14న ఆ జట్టు ఆస్ట్రియాతో తొలి గ్రూప్ మ్యాచ్ ఆడే సమయానికి టోర్నీలో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా 40 ఏళ్ల 75 రోజుల కిరాలీ రికార్డుల్లోకెక్కాడు. ఆ తర్వాత ప్రిక్వార్టర్స్‌లో బెల్జియంతో హంగేరీ తలపడడంతో ఆయన రికార్డు 40 ఏళ్ల 87 రోజులకు చేరింది. సూపర్ స్టార్ రిటైర్మెంట్.. యూరప్ సూపర్ స్టార్లలో ఒకడైన జ్లతాన్ ఇబ్రహీమోవిచ్ టోర్నీ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. స్వీడన్ కెప్టెన్ గా ఉన్న జ్లతాన్.. యూరోనే తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ కాబోతుందని, తమ జట్టుకు మూడోదైన చివరి గ్రూప్ మ్యాచ్ సందర్భంగా చెప్పాడు. బెల్జియం చేతిలో ఓడిన స్వీడన్.. గ్రూప్ దశలో చివరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దేశం తరఫున 15 ఏళ్ల కెరీర్లో 116 మ్యాచ్ లలో 62 గోల్స్ చేసిన 34 ఏళ్ల జ్లతాన్.. స్వీడన్ నుంచి ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అభిమానుల ఓవరాక్షన్.. క్రొయేషియా అభిమానుల ఓవరాక్షన్ ఆ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గ్రూప్ దశలో ఆ జట్టు రెండో మ్యాచ్ సందర్భంగా అభిమానులు మైదానంలోకి ఫ్లేర్స్ (మంటలు పుట్టించే సాధనాలు) విసిరారు. రెండో అర్ధభాగంలోఈ ఘటన చోటు చేసుకోగా.. మ్యాచ్ కాసేపు నిలిపి అనంతరం కొనసాగించారు. అయితే ఆసక్తికర ఆంశమేమిటంటే చెక్ రిపబ్లిక్ తో జరిగిన ఆ మ్యాచ్‌లో అప్పటికి క్రొయేషియా 2-1తో ఆధిక్యంలో ఉంది. విరామం అనంతరం ఏకాగ్రత కోల్పోయిన క్రొయేషియా ఆటగాళ్లు 89వ నిమిషంలో చెక్కు పెనాల్టీ సమర్పించుకున్నారు. దాంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్‌కు పంచ్.. గత రెండు సీజన్లుగా టైటిల్స్ నెగ్గుతూ వస్తున్న స్పెయిన్‌కు ఈసారి ప్రిక్వార్టర్స్ లోనే షాక్ తగిలింది. గత సీజన్లో తమను ఫైనల్లో ఓడించిన స్పెయిన్‌కు ఇటలీ జట్టు ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి చూపింది. చక్కటి ఆటతీరుతో టోర్నీలో తమ పునర్వైభవాన్ని చాటిన ఇటలీ 2-0తో స్పెయిన్‌ను చిత్తుచేసింది. వరుసగా రెండుసార్లు యూరోకప్ను నెగ్గి రికార్డు సృష్టించిన స్పెయిన్ రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. గ్రిజ్మన్ డబుల్.. టోర్నీ ద్వారా సూపర్ స్టార్‌గా మారిన ఆటగాడు గ్రిజ్మన్. ఫ్రాన్స్ స్ట్రైకర్ గ్రిజ్మన్ టోర్నీలో 6 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీని ఫ్రాన్స్ ను 2-0తో ఓడించడంతో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో రెండు గోల్స్ గ్రిజ్మన్ సాధించాడు. ఒకే టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానం సంపాదించాడు. వేల్స్ 'డ్రీమ్ రన్'.. ఇంగ్లండ్ నీడలో ఇన్నాళ్లు ఉంటూ వస్తున్న వేల్స్ ఈ టోర్నీ ద్వారా ప్రపంచ ఫుట్‌బాల్ పై తమ ముద్రను స్పష్టంగా వేసింది. తాము ఏ మాత్రం చిన్న జట్టు కాదని ఈ టోర్నీతో నిరూపించింది. గ్రూప్ దశలో రెండు విజయాలతో గ్రూప్ టాపర్ గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆ గ్రూప్ లోనే ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలవడం విశేషం. ప్రిక్వార్టర్స్ లో నార్తర్న్ ఐర్లాండ్ పై 1-0తో గెలిచింది. క్వార్టర్స్‌లో టోర్నీ ఫేవరెట్, సూపర్ స్టార్లతో కళకళలాడుతున్న బెల్జియంను 3-1తో చిత్తుచేసి సెమీస్ చేరింది. స్టార్ ఆటగాళ్లు గెరాత్ బేల్, రామ్సే, జో అలెన్ జట్టును ముందుండి నడిపించారు. ఐస్లాండ్ సంచలనం.. ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ఐస్లాండ్ సంచలనం సృష్టించింది. పోర్చుగల్, హంగేరీలతో గ్రూప్ మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. అలాగే ఆస్ట్రియాపై నెగ్గి గ్రూప్‌లో రెండోస్థానంలో నిలిచి ప్రిక్వార్టర్స్ కు చేరింది. అక్కడ ఇంగ్లండ్ ను 2-1తో ఓడించి టోర్నీలో అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. క్వార్టర్స్ లో ఫ్రాన్స్ చేతిలో 5-2తో ఓడినా.. తనదైన ముద్రవేసి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. గోల్ కీపర్లకు పరీక్ష.. ఒకవైపు దిగ్గజ గోల్ కీపర్ బఫన్.. మరోవైపు ప్రస్తుత తరం స్టార్ గోల్ కీపర్ నోయర్.. యూరోకప్ క్వార్టర్స్‌లో ఇటలీ, జర్మనీ మధ్య మ్యాచ్ వీరిద్దరికి పరీక్షలా మారింది. రెండు పెద్ద జట్లు తలపడిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ స్కోరు 1-1తో సమంగా కాగా.. పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఏకంగా 18 షాట్ల షూటౌట్ జరగగా.. 6-5 స్కోరుతో జర్మనీ నెగ్గి సెమీస్ చేరింది. షూటౌట్లో ఇద్దరు గోల్ కీపర్లు ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్లు సైతం పెనాల్టీలను మిస్ చేయడం విశేషం. -
పోర్చుగల్ ఫెజ్ ఈసో
-
పోర్చుగల్ ఫెజ్ ఈసో
95 సంవత్సరాలు... పోర్చుగల్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టి. ఈ ఆటంటే ఆ దేశానికి ‘పిచ్చి’. ఫుట్‌బాల్ ముందు ప్రాణాలు కూడా లెక్కలేవనేంత ‘ప్రేమ’. అంతర్జాతీయ యవనికపై అలుపెరగని పోరాటం చేసినా.. ఎంత కష్టపడినా... ఎంతమంది దిగ్గజాలు వచ్చినా ఏ ‘కప్’ కూడా అందలేదనే ఆవేదన. ఏ పెద్ద టోర్నీ జరిగినా దేశం ప్రతిసారీ ఊపిరిబిగబట్టి చూసింది. ఆ నిరీక్షణకు ఇంతకాలానికి తెరపడింది. ఆ ఆవేదన ఇన్ని సంవత్సరాలకు ఆనందభాష్పంగా మారింది. ఇంతకాలానికి ‘యూరో’కా అంటూ ఆ దేశం పొలికేక పెట్టింది. అవును... పోర్చుగల్ ఫెజ్ ఈసో... పోర్చుగల్ సాధించింది. తమ చరిత్రలో తొలిసారి యూరో ఫుట్‌బాల్ కోటలో జెండా పాతింది. అంచనాలు తలకిందులయ్యాయి. అందలం ఎక్కుతుందని భావించిన ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ తుది మెట్టుపై చతికిలపడింది. ఎవరూ ఊహించనిరీతిలో పోర్చుగల్ జట్టు తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. సొంతగడ్డపై ఫేవరెట్ ఫ్రాన్స్‌ను బోల్తా కొట్టించిన పోర్చుగల్ ఎట్టకేలకు అంతర్జాతీయ టైటిల్ లోటును తీర్చుకుంది. 12 ఏళ్ల క్రితం అందినట్టే అంది చేజారిన యూరో ట్రోఫీని ఈసారి ఒడిసి పట్టుకుంది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడినా... మిగతా ఆటగాళ్లు పట్టుదలతో పోరాడి పోర్చుగల్‌ను విజేతగా నిలిపారు. తమ సారథి రొనాల్డోకు చిరస్మరణీయ కానుకను ఇచ్చారు. తొలిసారి యూరో టైటిల్ నెగ్గిన పోర్చుగల్ ≈ ఫైనల్లో ఫ్రాన్స్‌పై 1-0తో విజయం ≈ అదనపు సమయంలో గోల్ చేసిన ఎడెర్ ≈ గాయంతో మధ్యలో వైదొలిగిన రొనాల్డో ≈ ఆధిపత్యం చలాయించినా ఆతిథ్య జట్టుకు నిరాశే పారిస్: అతి కష్టమ్మీద లీగ్ దశను దాటిన పోర్చుగల్ ఆఖరికి యూరో చాంపియన్‌గా అవతరించి సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పోర్చుగల్ 1-0తో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మ్యాచ్ 109వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఎడెర్ 25 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరేరీతిలో కుడి కాలితో సంధించిన శక్తివంతమైన కిక్ ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ లక్ష్యానికి చేరింది. ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత పోర్చుగల్ ఆటగాళ్లు మిగిలిన 11 నిమిషాల్లో ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యాయి. యూరో టోర్నమెంట్ చరిత్రలో ఓ ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో గోల్ కాకపోవడం ఇదే తొలిసారి. గోడలా పాట్రిసియో, పెపె రికార్డుస్థాయిలో మూడోసారి యూరో టైటిల్ సాధించాలని ఆశిస్తూ బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే ఫైనల్ చేరే క్రమంలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని ఫ్రాన్స్‌కు అంతిమ సమరంలో మాత్రం చుక్కెదురైంది. పలుమార్లు ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశాలు వచ్చినా... పోర్చుగల్ గోల్‌కీపర్ రుయ్ పాట్రిసియో, డిఫెండర్ పెపె అడ్డుగోడలా నిలబడి ఫ్రాన్స్ ఆశలను నిర్వీర్యం చేశారు. మరోవైపు పోర్చుగల్ స్టార్ ఆటగాడు రొనాల్డోను కట్టడి చేయాలనే లక్ష్యంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు కనిపించారు. ఈ క్రమంలో రొనాల్డోను పలుమార్లు మొరటుగా నిలువరించారు. తొమ్మిదో నిమిషంలో పాయెట్ ధాటికి రొనాల్డో మోకాలికి గాయమైంది. 25వ నిమిషంలో నొప్పికి తాళలేక మైదానంలో కూలబడి మిగిలిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంతకుముందు తొమ్మిదో నిమిషంలో గ్రిజ్మన్ కొట్టిన హెడర్ షాట్‌ను పోర్చుగల్ గోల్‌కీపర్ పాట్రిసియో అద్భుతంగా అడ్డుకున్నాడు. సారథి కోసం సైనికుల్లా... రొనాల్డో మైదానం వీడటంతో ఇక ఫ్రాన్స్ జట్టుకు ఎదురు ఉండదని భావించినా అలా జరగలేదు. తమ సారథి కోసం పోర్చుగల్ సహచరులు సైనికుల్లా పోరాడారు. 34వ నిమిషంలో సిసోకో కొట్టిన షాట్‌ను పోర్చుగల్ కీపర్ పాట్రిసియో సమర్థంగా నిలువరించాడు. ద్వితీయార్ధంలోనూ ఫ్రాన్స్ తమ ప్రయత్నాలను కొనసాగించింది. కానీ వారికి ఆశించిన ఫలితం దక్కలేదు. 79వ నిమిషంలో రెనాటో శాంచెస్ స్థానంలో ఎడెర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా పోర్చుగల్ బరిలోకి దించింది. 80వ నిమిషంలో క్వారెస్మా కొట్టిన షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ నిలువరించాడు. 84వ నిమిషంలో సిసోకో షాట్‌ను పాట్రిసియో మళ్లీ అడ్డుకున్నాడు. ఇంజ్యూరీ సమయంలో ఫ్రాన్స్ ఆటగాడు గిగ్నాక్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి బయటకు వెళ్లింది. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు గోల్ చేయకపోవడంతో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చారు. 15 నిమిషాల తొలి అర్ధభాగంలోనూ గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో నాలుగు నిమిషాలు ముగిశాక ఎడెర్ సుదూరం నుంచి కొట్టిన షాట్ ఫ్రాన్స్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయడంలో విఫలమై ఓటమి భారాన్ని మూటగట్టుకుంది. 41 ఫ్రాన్స్ జట్టుపై పోర్చుగల్ 41 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. 56 సొంతగడ్డపై జరిగిన ప్రధాన టోర్నమెంట్లో ఫ్రాన్స్ ఓడిపోవడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1 ఓ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఒక జట్టు లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచి... టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. 2 మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1984లో) తర్వాత ఒకే యూరో టోర్నీలో అత్యధికంగా ఆరు గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా గ్రిజ్మన్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. 2 ఈ టోర్నీలో ఫ్రాన్స్ ప్లేయర్ గ్రిజ్‌మన్‌కు లభించిన అవార్డులు. అతనికి గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్-6 గోల్స్), గోల్డెన్ బాల్ (ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ) పురస్కారాలు దక్కాయి. 10 యూరో టైటిల్‌ను సాధించిన పదో జట్టు పోర్చుగల్. జర్మనీ, స్పెయిన్ మూడేసిసార్లు, ఫ్రాన్స్ రెండుసార్లు విజేతగా నిలిచాయి. సమష్టిగా సాధించారు... యూరో కప్ సాధించిన అనంతరం స్వదేశం చేరిన పోర్చుగల్ జట్టుకు అభిమానులనుంచి భారీ ఎత్తున ఘన స్వాగతం ల భించింది. ఆటగాళ్లతో రాజధాని లిస్బన్‌కు వచ్చిన ప్రత్యేక విమానాన్ని రంగు రంగుల వాటర్ కెనాన్లతో ముంచెత్తారు. అనంతరం ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత జట్టు సభ్యులు దేశాధ్యక్షుడు మార్సెల్ రెబెలో డిసౌజాను కలిశారు. ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ కమాండర్స్’ అవార్డుతో జట్టును సత్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లూ డ్రా... అదృష్టం కొద్దీ అత్యుత్తమ మూడో స్థానపు జట్లలో నిలవడంతో నాకౌట్ అవకాశం ... టోర్నీ ఆరంభం సమయంలో ఎవరికీ అంచనాల్లేవు... అయినా పోర్చుగల్ సాధించి చూపించింది. ఫైనల్ సహా ఏడు మ్యాచ్‌లలో ఒక్క సారి మాత్రమే నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలవగలిగినా, ఒకే యూరోలో మూడు సార్లు అదనపు సమయం ఆడిన తొలి జట్టుగా నిలిచినా... పోర్చుగల్ సాధించిన విజయం విలువ తక్కువేమీ కాదు. ‘మాకు గెలిచే అర్హత లేదని చాలా మంది చెప్పుకుంటే చెప్పుకోనీ. మేం మాత్రం సగర్వంగా తిరిగి వెళుతున్నాం. మేం పావురాల్లా సాధారణంగా కనిపించినా, పాముల్లా తెలివితేటలు ప్రదర్శించాం’ అని ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ చెప్పడం ఎలాంటి స్థితినుంచి పోర్చుగల్ చాంపియన్‌గా నిలిచిందో సూచిస్తుంది. పోర్చుగల్ టీమ్ వన్ మ్యాన్ ఆర్మీ ఎంత మాత్రం కాదు... ఇన్నాళ్లూ రొనాల్డో ఒక్కడే అంతా అయి కనిపించిన ఆ జట్టు ఇప్పుడు సమష్టి తత్వంతో యూరో చాంపియన్‌గా నిలిచింది. అతను లేకుండా కూడా ఫైనల్లో సత్తా చాటి టైటిల్ సాధించగలగడమే మరో విశేషం. ఫ్రాన్స్‌ను వారి సొంతగడ్డపై 41 ఏళ్ల తర్వాత చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడం అనేది అసాధారణం. ఈ విజయంలో జట్టులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. కెప్టెన్ రొనాల్డో నుంచి ఫైనల్ హీరో ఎడెర్ వరకు అంతా తమ పరిధిలో చెలరేగారు. వీరందరినీ నడిపించిన సాంటోస్ వ్యూహ చతురతా ఉంది. కోచ్ మార్గదర్శనంలో... చాలా మంది భావిస్తున్నట్లు ఇదేమీ అనుకోకుండా దక్కిన గెలుపు కాదు. ఐస్లాండ్, ఆస్ట్రియాలతో డ్రా తర్వాత హంగేరీ చేతిలో చిత్తుగా ఓడబోయి లక్కీగా డ్రా చేసుకోగలిగిన జట్టు ఇప్పుడు చాంపియన్‌గా నిలిచింది. క్లిష్ట సమయంలో కోచ్ సాంటోస్ సమర్థంగా తన బాధ్యత నిర్వర్తించారు. ఆయన కోచ్‌గా వచ్చిన తర్వాత తొలి మ్యాచ్‌లోనే ఆల్బేనియా చేతిలో పోర్చుగల్ ఓడింది. అయితే ఆ తర్వాత 14 మ్యాచ్‌లలో జట్టుకు పరాజయం లేదు. ఫైనల్లో ఎడెర్‌ను అనూహ్యంగా మైదానంలోకి దించిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. అన్నింటికి మించి ఇతర పెద్ద జట్లతో పోలిస్తే ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా మంచి వాతావరణం ఉండేలా ఆయన చూశారు. ఒకరిని మించి మరొకరు టోర్నీలో సహజంగానే స్టార్ ప్లేయర్ రొనాల్డో ముద్ర కనిపించింది. అంతా అతని చుట్టే తిరిగినట్లు అనిపించినా ఇతర ఆటగాళ్ల ప్ర దర్శన కూడా జట్టును గెలిపించింది. పెపె అద్భుత డిఫెన్స్ జట్టు కు బలంగా మారింది. పోలండ్పై గోల్ చేసిన 18 ఏళ్ల కొత్త కుర్రా డు సాంచెజ్ మ్యాచ్‌ను పెనాల్టీల వైపు మళ్లించాడు. ఫైనల్లో గోల్ కీపర్ పాట్రిసియో రక్షణ గోడను ఛేదించడం ఫ్రాన్స్ వల్ల కాలేదు. ఇక ఒక్క గోల్‌తో ఎడెర్ హీరోగా మారిపోయాడు. ఇంతకు ముందు 28 మ్యాచ్‌లు ఆడినా కేవలం ఫ్రెండ్లీలలో 3 గోల్స్ చేసిన అతను జట్టులో అందరికంటే తక్కువ గుర్తింపు ఉన్న ఆటగాడు. కానీ ఫైనల్ ద్వారా ఇప్పుడు అతని స్థాయి పెరిగిపోవ డం ఖాయం. ఇక పోర్చుగల్ తదుపరి లక్ష్యం 2018 ప్రపంచకప్. రూ. 189 కోట్లు యూరో టైటిల్ సాధించిన పోర్చుగల్‌కు ప్రైజ్‌మనీ రూపంలో మొత్తం 2 కోట్ల 55 లక్షల యూరోలు (రూ. 189 కోట్లు) లభించాయి. రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 2 కోట్ల 45 లక్షల యూరోలు (రూ. 181 కోట్లు) దక్కాయి. - సాక్షి క్రీడావిభాగం -
చరిత్ర సృష్టించిన పోర్చుగల్
-
చరిత్ర సృష్టించిన పోర్చుగల్
పారిస్: యూరో కప్‌లో పోర్చుగల్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టు ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి పోర్చుగల్ తొలిసారి యూరోకప్ను అందుకుంది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పోర్చుగల్ ఆటగాడు ఏడర్.. అదనపు సమయంలో గోల్ కొట్టి తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించాడు. స్టార్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో గాయంతో ఫస్ట్ ఆఫ్‌లోనే మైదానాన్ని వీడినా పోర్చుగల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడింది. యూరోకప్ విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. 2004 యూరోకప్‌లో ఆతిథ్య జట్టుగా ఫైనల్‌కు చేరిన పోర్చుగల్.. 1-0 గోల్స్ తేడాతో గ్రీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు మాత్రం ఆతిథ్య జట్టు ఫ్రాన్స్‌ను అదే స్కోరుతో ఓడించి పోర్చుగల్ యూరోకప్ కలను నెరవేర్చుకోవటం విశేషం.