వైట్‌వాష్‌ దిశగా ఆసీస్‌!

England Win By 6 Wickets Against Australia In 4th ODI - Sakshi

నాలుగో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం

ఆరోన్‌ ఫించ్‌, షాన్‌ మార్ష్‌ శతకాలు వృధా

చెస్టర్‌ లి స్ట్రీట్‌: ఇంగ్లండ్‌ ఖాతాలో మరో రికార్డు విజయం పడగా.. ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో మరో అపజయాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు మరో విజయం సాధిస్తే ఆసీస్‌కు వైట్‌ వాష్‌ తప్పదు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన నామమాత్రమైన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు  ఆసీస్‌ నిర్దేశించిన భారీ లక్ష్యం కూడా చాలా చిన్నదయిపోయింది. 

311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాసన్‌ రాయ్‌(101; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో(79; 66 బంతుల్లో 10ఫోర్లు) రాణించాడు. దీంతో తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. తొమ్మిది పరుగుల వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించారు. చివర్లో ఐపీఎల్‌ హీరో బట్లర్‌ (54; 29 బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్సర్‌) చెలరేగటంతో మరో 32 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ బౌలర్లలో అగర్‌ రెండు వికెట్లు తీయగా.. స్టాన్‌లేక్‌, లియాన్‌లు తలో వికెట్‌ సాధించారు. 

అంతకముందు  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫించ్‌ (100; 106బంతుల్లో  6 ఫోర్లు, 3 సిక్సర్లు), షాన్‌ మార్ష్‌ (101; 92 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. హెడ్‌ (63; 9 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్లీకి 4, వుడ్, ఆదిల్‌ రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. చివరి వన్డే ఆదివారం జరగనుంది.

హైలెట్స్‌:

  • ఛేజింగ్‌ పరంగా(312పరుగుల) ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియాపై ఇదే అతిపెద్ద విజయం, గతంలో(2008) 308 పరుగల ఛేదనే అత్యుత్తమం
  • ఒక క్యాలెండ్‌ ఇయర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన 9 వన్డేల్లో ఇంగ్లం‍డ్‌ ఎనిమిది విజయాలు సాధించింది. మరో విజయం సాధిస్తే ఇయర్‌ క్యాలెండర్‌లో అత్యధిక విజయాల రికార్డును ఇంగ్లండ్‌ తిరగరాసుకుంటుంది.  
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top