ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

England Bowled Out for 85 vs Ireland - Sakshi

ప్రపంచ విజేతకు షాకిచ్చిన పసికూన

లార్డ్స్‌ టెస్ట్‌లో 85 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌

5 వికెట్లతో చెలరేగిన ఐర్లాండ్‌ పేసర్‌

లార్డ్స్‌ : వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు టెస్టుల్లో పసికూన ఐర్లాండ్‌ దిమ్మతిరిగే షాకిచ్చింది. బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 85 పరుగులకే కుప్పకూల్చి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను పర్యాటక జట్టు బౌలర్‌ టిమ్‌ ముర్తాగ్‌ 5 వికెట్లతో చెలరేగి కోలుకోలేని దెబ్బతీశాడు. ఐర్లాండ్‌ బౌలర్ల దాటికి ప్రపంచమేటి బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో డేన్లీ(23), కరన్‌(18), స్టోన్‌ (19) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

బెయిర్‌స్టో, మోయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌ అయితే ఖాతా కూడా తెరవలేకపోయారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ముర్తాగ్‌కు తోడుగా మార్క్‌ అదైర్‌ మూడు, ర్యాంకిన్‌ రెండు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ కేవలం 23.4 ఓవర్లకే ముగిసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఐర్లండ్‌ 32/1తో నిలకడగా ఆడుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌కు ఇది అత్యంత చెత్త రికార్డుగా మిగిలిపోయింది.

వన్డేల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్‌... సంప్రదాయ టెస్టు క్రికెట్‌లోనూ ఉనికి చాటుకోవడానికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. గతేడాదే టెస్టు అరంగేట్రం చేసిన ఐర్లాండ్‌ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లే ఆడింది. తొలి టెస్టులోనే పెద్ద జట్టయిన పాకిస్తాన్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడింది. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులోనూ పరాజయం పాలైనా ఫర్వాలేదనే ప్రదర్శన చేసింది. తాజాగా వన్డే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు మచ్చెమటలు పట్టించింది.

ఐర్లాండ్‌ జట్టులో కౌంటీల్లో ఆడిన అనుభవం ఉన్నపేసర్‌ టిమ్‌ ముర్టాగ్‌ చెలరేగాడు. ఇటీవలే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 800 వికెట్ల మైలురాయిని అందుకున్న ముర్టాగ్‌ తన సత్తా ఎంటో చూపించాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్‌ విధ్వంసక ఓపెనర్‌ జాసన్‌ రాయ్, పేసర్‌ స్టోన్‌కు ఈ మ్యాచ్‌ ఓ పిడ కలలా మారింది. వన్డేల్లో మెరుపులు మెరిపించిన రాయ్‌ ఈ మ్యాచ్‌లో 5 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top