ఫైనల్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌

Du Plessis special carries CSK to IPL 2018 final - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కేనే పైచేయి సాధించింది. ఫలితంగా తొలి ఫైనల్‌ బెర్తును సీఎస్‌కే ఖరారు చేసుకుంది. సీఎస్‌కే ఆటగాడు డుప్లెసిస్‌(67 నాటౌట్‌; 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిచిపించాడు.

సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే తడబడింది. 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షేన్‌వాట్సన్‌ డకౌట్‌గా తొలి వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరగా, సురేశ్‌ రైనా(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై వెంటనే అంబటి రాయుడు డకౌట్‌గా నిష్ర్కమించాడు. దాంతో సీఎస్‌కే 24 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో ఎంఎస్‌ ధోని(9) క్లీన్‌బౌల్డ్‌ కాగా, బ్రేవో(7), జడేజా(3)లకు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన డుప్లెసిస్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బాధ్యతాయుతంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చివరి మూడు ఓవర్లలో సీఎస్‌కే విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్‌ రెచ్చిపోయాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కొట్టాల్సిన స్కోరును తగ్గించుకుంటూ వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా, డుప్లెసిస్‌ తొలి బంతినే సిక్స్‌ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌(15 నాటౌట్‌; 5బంతుల్లో 3 ఫోర్లు) చక్కటి సహకారం అందివ్వడంతో చెన్నై ఇంకా ఐదు బంతులుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది.

అంతకముందు సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇన‍్నింగ్స్‌ తొలి బంతికే శిఖర్‌ ధావన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్‌తో కలిసి 34 పరుగులు జత చేసిన గోస్వామి(12) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మరో రెండు పరుగుల వ్యవధిలో కేన్‌ విలియమ్సన్‌(24) కూడా ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకిబుల్‌ హసన్‌(12) పెవిలియన్‌ చేరడంతో సన్‌రైజర్స్‌ మరింత ఇబ్బందుల్లో పడింది. ఆపై యూసఫ్‌ పఠాన్‌(24) ఫర్వాలేదనిపించడంతో సన్‌రైజర్స్‌ తిరిగి తేరుకుంది.  కాగా, చివర్లో హిట్టర్‌ బ్రాత్‌వైట్‌(43  నాటౌట్‌; 29 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ తేరుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top