ఈ విరామం ఊహించలేదు | Dronavalli Harika Speaks About Present Situation Of Coronavirus | Sakshi
Sakshi News home page

ఈ విరామం ఊహించలేదు

Mar 30 2020 12:20 AM | Updated on Mar 30 2020 4:27 AM

Dronavalli Harika Speaks About Present Situation Of Coronavirus - Sakshi

స్విట్జర్లాండ్‌ గ్రాండ్‌ప్రి టోర్నీ సందర్భంగా...

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో ప్రస్తుతం ఏర్పడిన కల్లోల వాతావరణం త్వరలోనే తగ్గుముఖం పడుతుందని... పరిస్థితులు చక్కబడతాయని ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ద్రోణవల్లి హారిక అభిప్రాయపడింది. క్రీడాకారుల కెరీర్‌లో ఖాళీ సమయం చాలా తక్కువ సందర్భాల్లో దొరుకుతుందని... ఊహించని విధంగా లభించిన విరామ సమయాన్ని ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటున్నానని ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మూడుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన హారిక తెలిపింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నీలో పాల్గొని తిరిగొచ్చిన హారిక హోం క్వారంటైన్‌లోకి వెళ్లింది. ఆదివారంతో స్వీయ నిర్బంధం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...

స్విట్జర్లాండ్‌లోని లుసానేలో మార్చి 1 నుంచి 13 వరకు జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నాను. 14వ తేదీన స్విట్జర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాను. కరోనా కట్టడికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నేను విదేశం నుంచి రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. ఆదివారంతో అధికారికంగా నా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గడువు పూర్తయింది. అంతా సవ్యంగా ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు స్వయంగా వచ్చి ధ్రువీకరించారు. స్వీయ నిర్బంధం ముగిసినా నేను ఇంట్లోనే ఉంటున్నాను. లాక్‌డౌన్‌ను పాటిస్తు న్నాను. కొంతకాలం నుంచి విరామం లేకుండా టోర్నమెంట్‌లు ఆడుతున్నాను. స్విట్జర్లాండ్‌ నుం చి వచ్చాక  నాలుగైదు రోజులపాటు ఒకే గదికి పరిమితమయ్యాను. ఆటకు వారం రోజులపాటు బ్రేక్‌ ఇచ్చాను. క్వారంటైన్‌ పూర్తవ్వడంతో మళ్లీ చెస్‌పై దృష్టి పెట్టాను. అయితే అంత సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేయడంలేదు. శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండటం కోసం వ్యాయామం, యోగా చేస్తున్నాను. ఆగస్టులో మాస్కోలో జరగాల్సిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కారణంగా దాదాపు అన్ని క్రీడాంశాల్లో టోర్నీలు రద్దు కావడం లేదంటే వాయిదా పడటం జరిగింది.

ఈ ఏడాది నా తదుపరి టోర్నీ ఏంటనే విషయం ప్రస్తుతం నాకే తెలియదు. ఒక్కసారిగా ఊహించని విధంగా ఇంత సమయం విరామం లభిస్తుందని ఊహించలేదు. పెళ్లయ్యాక నేను తొలిసారి నాలుగైదు నెలలు ఇంటివద్దే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతర్జాతీయస్థాయిలో కొన్నాళ్లపాటు చాలా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కరోనా కట్టడి అయ్యాక అంతా సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతుందని ఆశాభావంతో ఉన్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనమందరం మంచే జరుగుతుందనే ఆశావహ దృక్పథంతో ఉండాలి. అయితే కరోనా సృష్టించిన భయం కారణంగా కొన్నాళ్లపాటు విదేశీ ప్రయాణాలు చేయడానికి అందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. నేను స్విట్జర్లాండ్‌ వెళ్లినపుడు అక్కడ కరోనా సీరియస్‌గా లేదు. తిరిగి వచ్చాక పరిస్థితి తీవ్రరూపం దాల్చిం ది. టోర్నీ జరుగుతున్న సమయంలో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఫోన్‌ చేసి జాగ్రత్తగా ఉండమని సూచించారు. టోర్నీ జరుగుతున్న సమయంలో నేను కూడా వేదిక వద్దకు వెళ్లడం, గేమ్‌ పూర్తికాగానే వెంటనే హోటల్‌ గదికి చేరుకోవడం చేశాను.

ప్రపంచ వ్యాప్తంగా క్రీడా పోటీలు నిలిచిపోయిన దశలో మాస్కోలో క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీని నిర్వహించడం వివాదాస్పదమైంది. అయితే రష్యాలో కరోనా మరీ తీవ్రంగా లేకపోవడంతో అప్పటి పరిస్థితులనుబట్టి ‘ఫిడే’ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాను. అయితే ఏడు రౌండ్‌లు ముగిశాక రష్యా ప్రభు త్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించడంతో టోర్నీని మధ్యలో నిలిపేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న చైనా, ఇటలీ దేశాలకు సంబంధించి నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. చైనాలోనే నేను గ్రాండ్‌మాస్టర్‌ హోదా సంపాదించాను. ఐదేళ్ల క్రితం రోమ్‌లో వరల్డ్‌ బ్లిట్జ్‌ ఆన్‌లైన్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ గెల్చుకున్నాను. అయితే ఇటలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కలచి వేస్తున్నాయి. అన్ని చోట్లా అందరూ కరోనా నుంచి తొందరగానే కోలుకోవాలని, అంతటా సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నాను.   

హైదరాబాద్‌లో భర్త కార్తీక్‌ చంద్రతో హారిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement