
డోపీలను క్షమించకండి: నాదల్
ఇటీవల కాలంలో తరచు వెలుగుచూస్తున్న డోపింగ్ వివాదాలపై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తీవ్రంగా మండిపడ్డాడు.
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో తరచు వెలుగుచూస్తున్న డోపింగ్ వివాదాలపై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తీవ్రంగా మండిపడ్డాడు. డోపింగ్కు పాల్పడిన వారికి ఎటువంటి క్షమాబిక్షను ప్రసాదించుకుండా చేస్తేనే క్రీడల్లో పారదర్శకత వస్తుందన్నాడు. ఒక్కసారి డోపీలుగా తేలితే ఆయా క్రీడాకారులను ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రాతినిథ్యం లేకుండా చేయాలన్నాడు. క్రీడల్లో నాణ్యత పెంచాలంటే ఇదే సరైన మార్గమని నాదల్ సూచించాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో భాగంగా భారత్లో ఉన్న నాదల్.. డోపింగ్ కు పాల్పడే మోసగాళ్లకు వేసే శిక్షలు అత్యంత కఠినంగా ఉండాలన్నాడు. మన దగ్గర ఉన్న అత్యుత్తమ యాంటీ డోపింగ్ విధానంతో డోపీలకు అడ్డుకట్ట వేసిన రోజే క్రీడ అనేది క్లీన్గా ఉంటుందన్నాడు.
దాదాపు 25 మంది క్రీడాకారులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ రష్యా హ్యాకింగ్ గ్రూప్ ఫాన్సీ బీర్స్ చేసిన పోస్ట్ తాజాగా కలకలం రేపింది. ఇలా నిషేధిత డ్రగ్స్ తీసుకునే వారిలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా-వీనస్) ఉన్నారంటూ పేర్కొంది. దీంతో మరోసారి డోపింగ్ అలజడి రేగింది. గతంలో రష్య క్రీడాకారిణి మారియా షరపోవా డోపింగ్ కు పాల్పడిన కారణంగా నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.