అద్భుతాలు ఆశించొద్దు: ఆర్చర్‌

Dont Expect Any Miracles Archer - Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌.. తాను గతం కంటే ఎక్కువగానే ఈ ఫార్మాట్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యానన్నాడు. అయితే తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని ఒత్తిడిని తగ్గించుకునే యత్నం చేశాడు. తనకు ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ అయినా ఒకటేనని , ఇక్కడ ఫలాన ఫార్మాట్‌లో ఆడతానని నిబంధనలు ఏమీ లేవన్నాడు. లార్డ్స్‌ వేదికగా జరుగనున్న రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పడతామని, ఒకవేళ ఆర్చర్‌ వచ్చినా తాము ధీటుగానే బదులిస్తామని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ హెచ్చరించాడు.

ఈ నేపథ్యంలో ఆర్చర్‌ మాట్లాడుతూ.. లాంగర్‌ వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోనన్నాడు. మరొకవైపు తన టెస్టు అరంగేట్రంపై ఆర్చర్‌ మాట్లాడుతూ.. ‘ నేను వైట్‌బాల్‌ క్రికెట్‌ కంటే కూడా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఎక్కువ ఆడా. దాంతో టెస్టు ఫార్మాట్‌ భయం లేదు. నేను రెడ్‌బాల్‌ ఎక్కువ ఆడాననే విషయం అభిమానులకు తెలియకపోవచ్చు. నేను ససెక్స్‌తో క్రికెట్‌ను ఆరంభించినప్పుడు ఆడింది రెడ్‌బాల్‌ క్రికెటే.  మానసికంగా బలంగా లేనప్పుడు అసలు మనం ఎవరనే ప్రశ్న తలెత్తుంది. నేను టెస్టు ఫార్మాట్‌లో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ఆర్చర్‌ తెలిపాడు.

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో  ఇంగ్లండ్‌​ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ఆర్చర్‌ నిలిచాడు. ఆపై సెకండ్‌ ఎలెవన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ససెక్స్‌ సౌత్‌ తరఫున ఆడిన ఆర్చర్‌ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడమే కాకుండా సెంచరీతో మెరిశాడు. ఇదిలా ఉంచితే, గత 11 నెలల కాలంలో ఆర్చర్‌ కేవలం ఒక్క రెడ్‌బాల్‌ క్రికెట్‌ మాత్రమే ఆడటమే చర్చనీయాంశమైంది. యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించినా ఎన్ని ఓవర్లు నిలకడగా బౌలింగ్‌ చేయగలడు అనేది ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. గాయం కారణంగా రెండో టెస్టుకు సైతం జేమ్స్‌ అండర్సన్‌ దూరం కావడంతో ఆర్చర్‌ ఎంపిక అనేది ఖాయంగా కనబడుతోంది. బుధవారం ఇంగ్లండ్‌-ఆసీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top