సమ్మోహితాస్త్రం...

సమ్మోహితాస్త్రం...


టి20ల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన మోహిత్‌ ఆహ్లావత్‌

72 బంతుల్లో 39 సిక్సర్లు, 14 ఫోర్లతో 300 నాటౌట్‌


టి20 క్రికెట్‌లో వేగంగా 30 పరుగులు చేస్తే చాలు ఆ ఇన్నింగ్స్‌ ఎంతో విలువైనదే... అర్ధ సెంచరీ చేయడం అంటే చాలా బాగా ఆడినట్లు... సెంచరీ అనేది చాలా మందికి సుదూర స్వప్నం... ఇక డబుల్‌ సెంచరీ అనేది ఏ స్థాయి క్రికెట్‌లోనైనా గేల్, మెకల్లమ్‌లాంటి మెరుపు వీరులకు కూడా సాధ్యం కాలేదు. అలాంటిది టి20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 300 పరుగులు బాదేయడం అంటే మహాద్భుతం జరిగినట్లే! ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్‌ ఆహ్లావత్‌ ఇలాంటి అసాధ్యాన్ని చేసి చూపించాడు. టి20ల్లో ఏ స్థాయి మ్యాచ్‌లో అయినా ‘ట్రిపుల్‌ సెంచరీ’ చేసిన తొలి ఆటగాడిగా మోహిత్‌ చరిత్ర సృష్టించాడు.న్యూఢిల్లీ: 39 సిక్సర్లతో 234 పరుగులు... 14 ఫోర్లతో 56 పరుగులు... మొత్తం బౌండరీల ద్వారానే 290 పరుగులు... మిగిలిన పది మాత్రమే అలా సింగిల్స్‌తో వచ్చాయి! ఇదీ మోహిత్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ సంక్షిప్త రూపం. అతను కేవలం 72 బంతులు మాత్రమే ఎదుర్కొని ఈ పరుగుల సునామీని సృష్టించడం విశేషం.  ఆకాశమే హద్దుగా సాగిన ఈ బీభత్సానికి ఇక్కడి లలితా పార్క్‌ మైదానం మంగళవారం వేదికైంది. క్రికెట్‌ ప్రమాణాల ప్రకారం చూస్తే పరిమాణం రీత్యా ఇదేమీ చిన్న మైదానం కాదు. సాధారణ సైజులోనే ఉన్న ఈ గ్రౌండ్‌లో ఆకాశమే హద్దుగా మోహిత్‌ సిక్సర్లతో చెలరేగిపోయాడు.ఫ్రెండ్స్‌ ఎలెవన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మోహిత్‌ మావి ఎలెవన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 250 వద్ద ఉన్న మోహిత్‌ తర్వాతి రెండు ఓవర్లలో మిగిలిన 50 పరుగులు రాబట్టి అజేయంగా నిలవడం విశేషం. ఆఖరి ఓవర్లో తొలి బంతిని ఫోర్‌ కొట్టిన అతను, చివరి ఐదు బంతులను సిక్సర్లుగా మలచి మొత్తం 34 పరుగులు కొల్లగొట్టాడు. ‘బౌలింగ్‌ మరీ అంత బలహీనంగా కూడా ఏమీ లేదు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకొని ఎదురుదాడికి దిగాను. అన్నీ బాగా కలిసి రావడంతో పరుగులు వరదలా పారాయి. మరో ఐదు ఓవర్లు ఉన్న సమయంలో 200కు చేరాను. మరింత నిర్దాక్షిణ్యంగా బ్యాటింగ్‌ చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. 300 పరుగుల కోసం ప్రయత్నిస్తానని నా సహచరుడితో చెప్పాను. చివరకు సాధించగలిగా’ అని తన బ్యాటింగ్‌పై మోహిత్‌ వ్యాఖ్యానించాడు.   గతంలో ఇంగ్లండ్‌లోని లాంకషైర్‌ సాడిల్‌వర్త్‌ లీగ్‌లో  శ్రీలంక ఆటగాడు ధనుక పతిరణ 72 బంతుల్లో అత్యధికంగా 277 పరుగులు (29 సిక్సర్లు, 18 ఫోర్లు) చేశాడు. ఈ రికార్డును మోహిత్‌ తిరగ రాశాడు.కొత్తవాడేమీ కాదు...

ఎవరీ మోహిత్‌?... దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌ బరిలోకి దిగేందుకు సిద్ధమైన సమయంలో జట్టు కెప్టెన్‌ గౌతం గంభీర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగిన ప్రశ్న ఇది. వికెట్‌ కీపర్‌గా జట్టులోకి వచ్చిన అతని ప్రతిభపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఇదే చర్చ ఢిల్లీ క్రికెట్‌లో కూడా వినిపించింది. పానిపట్‌కు చెందిన ట్రక్‌డ్రైవర్‌ కొడుకైన మోహిత్‌ దురదృష్టవశాత్తూ 2015–16 సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌లు ఆడి కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉండటంతో మరో అవకాశం దక్కకుండానే అంతర్ధానమయ్యాడు.ఇప్పుడు మరోసారి అతను క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ‘గౌతీ భాయ్‌ నా ప్రదర్శన గురించి తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నా. అయితే ఈ ఒక్క మ్యాచ్‌ నాకు ఐపీఎల్‌ అవకాశం ఇప్పిస్తుందా అనేది చెప్పలేను’ అని మోహిత్‌ చెప్పాడు. తాజాగా వేలం కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో మోహిత్‌ పేరు కూడా ఉంది. ఒక్క మెరుపు ఇన్నింగ్స్‌లో ఐపీఎల్‌లో రికార్డు మొత్తం కొల్లగొట్టిన ఆటగాళ్లెందరో గతంలోనూ ఉన్నారు. ఈసారి అయితే ఏకంగా 300 పరుగుల రికార్డే నమోదైంది. ఇలాంటి స్థితిలో మోహిత్‌ను తీసుకునేందుకు ఏ జట్టయినా సిద్ధమవుతుందనడంలో సందేహం లేదు. మరి గంభీర్‌ తన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోసం అతడిని ఎంచుకుంటాడా చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top