కోహ్లి మోనాలిసా పెయింటింగ్‌లాంటోడు! | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 7:20 PM

Dean Jones Says Virat Kohli Is Flawless Like The Mona Lisa - Sakshi

సిడ్నీ: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవిదేశాల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్‌ జోన్స్‌ టీమిండియా సారథిపై ప్రశంసలు జల్లు కురిపించారు. కోహ్లి బ్యాటింగ్‌ చేస్తుంటే అలానే చూడాలనిపిస్తుందని పేర్కొన్నాడు. షాట్‌ సెలక్షన్‌, టైమింగ్‌లో ప్రస్తుత క్రికెటర్లలో కోహ్లిని మించిన వారెవరూ లేరని పొగడ్తలతో ముంచెత్తాడు. కేవలం స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ కోహ్లి అదరగొడుతుండటం అతని ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించాడు. కోహ్లితో జాగ్రత్తగా ఉండమని ఆసీస్‌ ఆటగాళ్లను కూడ హెచ్చరించాడు. (సచిన్‌ రికార్డులపై కన్నేసిన కోహ్లి)

‘కోహ్లి బ్యాటింగ్‌లో లోపాలను వెతకాలనుకోవడం.. మోనాలిసా పెయింటింగ్‌లో తప్పులను వెతకడంవంటిది. ఏ జట్టయినా అతన్ని కవర్ డ్రైవ్ ఆడకుండా చూడాలి. ఆస్ట్రేలియా బౌలర్లూ అదే పని చేయాలి. పిచ్‌పై వేర్వేరు ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి. అతని వికెట్‌ దక్కాలని అనుకునే బౌలర్లు వైవిధ్యమైన బంతులేయాలి’అంటూ డీన్‌ జోన్స్‌ పేర్కొన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అదరగొట్టడం ఖాయమని జోన్స్‌తో సహా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆసీస్‌లోనూ కోహ్లికి ఘనమైన రికార్డే ఉంది. ఆసీస్‌ గడ్డపై ఎనిమిది టెస్టుల్లో ఐదు శతకాల సహాయంతో 992 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో మరో రెండు శతకాలు సాధిస్తే సచిన్‌ టెండూల్కర్‌(6) రికార్డును కోహ్లి అధిగమించే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్‌)

Advertisement
Advertisement