చెన్నై పైపైకి...  | CSK Beat SRH By 6 Wickets | Sakshi
Sakshi News home page

చెన్నై పైపైకి... 

Apr 23 2019 11:38 PM | Updated on Apr 24 2019 8:14 AM

CSK Beat SRH By 6 Wickets - Sakshi

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌–12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హర్భజన్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భువీ, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్స న్‌ స్వదేశం వెళ్లడంతో షకీబుల్‌ హసన్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగాడు. భువనేశ్వర్‌ సారథ్యం వహించాడు.  

పాండే వేగంగా... 
చెన్నై టాస్‌ గెలిచింది కానీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ రెండో ఓవర్లోనే బెయిర్‌స్టో (0) వికెట్‌ కోల్పోయింది. హర్భజన్‌ అతన్ని డకౌట్‌ చేశాడు. మనీశ్‌ పాండే రావడంతోనే బౌండరీతో ఖాతా తెరిచాడు. ఇదే దూకుడును కొనసాగించాడు. భజ్జీ తదుపరి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 4వ) మొదటి బంతిని వార్నర్, చివరి బంతిని పాండే సిక్సర్లుగా మలిచారు. ఆ తర్వాత చహర్‌ బౌలింగ్‌లో చెరో బౌండరీ బాదారు. పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ 54/1 స్కోరు చేసింది. చిత్రంగా... డాషింగ్‌ ఓపెనర్‌ వార్నర్‌ కంటే వేగంగా పాండే బ్యాటింగ్‌ చేశాడు. బంతి గతి తప్పితే సిక్స్, బ్యాట్‌కు అందితే ఫోర్‌ ఇలా చకాచకా పరుగుల్ని జతచేశాడు. 

వార్నర్‌ మెరుగ్గా... 
హైదరాబాద్‌ 10 ఓవర్లలో 91/1 స్కోరు చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే పాండే ఫోర్‌తో అతని ఫిఫ్టీ, జట్టు 100 పరుగులు పూర్తయ్యాయి. అతను 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. అనంతరం వార్నర్‌  39 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 13 ఓవర్లపాటు క్రీజులో ఉన్న ఈ జోడీ ఒకట్రెండు ఓవర్లు మినహా ప్రతీ ఓవర్‌లో ఫోర్, లేదంటే సిక్సర్‌ బాదకుండా విడిచిపెట్టలేదు. 14వ ఓవర్‌వేసిన హర్భజన్‌... వార్నర్‌ను ఔట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం విజయ్‌ శంకర్‌ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో ఆఖర్లో స్కోరు, జోరు తగ్గింది.  

వాట్సన్‌ బాదేశాడు... 
లక్ష్యఛేదనకు దిగిన చెన్నై కూడా ఆరంభంలోనే ఓపెనర్‌ డు ప్లెసిస్‌ (1) వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన రైనా... ఓపెనర్‌ వాట్సన్‌కు జతయ్యాడు. ఇద్దరు చెలరేగడంతో హైదరాబాద్‌ బౌలింగ్‌ కకావికలమైంది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఐదో ఓవర్లో వాట్సన్‌ వరుసగా 6, 4 కొడితే ఆ మరుసటి ఓవర్‌ వేసిన సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రైనా రెచ్చిపోయాడు. 4, 0, 4, 4, 4, 6తో ఏకంగా 22 పరుగులు సాధించాడు. చెన్నై పవర్‌ ప్లే స్కోరు 49/1. రషీద్‌ ఖాన్‌ను రంగంలోకి దింపినా... ఈ జోడీ జోరులో ఏమార్పు లేదు. ఇద్దరు చెరో బౌండరీ కొట్టారు. అయితే తన తర్వాతి ఓవర్లో రైనాను ఔట్‌ చేయడం ద్వారా రషీద్‌ 77 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. 10 ఓవర్లలో చెన్నై 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. రాయుడు జతయ్యాక వాట్సన్‌ దూకుడు మరింత పెరిగింది. 12వ ఓవర్‌ వేసిన సందీప్‌ బౌలింగ్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన వాట్సన్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. రషీద్‌ 14వ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టాడు. ఇలా భువనేశ్వర్, రషీద్, ఖలీల్‌ ఎవరు బౌలింగ్‌కు దిగినా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. జోరుగా సాగుతున్న ఇతని ఇన్నింగ్స్‌కు ఎట్టకేలకు భువీ 18వ ఓవర్లో చెక్‌ పెట్టాడు. 4 పరుగుల తేడాతో సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. తర్వాత రెండు ఓవర్లు పొదుపుగా వేయడం తో ఆఖరి 6 బంతులకు చెన్నై 9 పరుగులు చేయాల్సి వచ్చింది. సందీప్‌ వేసిన చివరి ఓవర్లో జాదవ్‌ సిక్సర్‌ (11 నాటౌట్‌) బాదడంతో లక్ష్యం సులువైంది. రాయుడు (25 బంతుల్లో 21; ఫోర్‌) ఔటైనా... మరో బంతి మిగిలుండగానే చెన్నై నెగ్గింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement