చెన్నై చెడుగుడు

Chennai Super Kings Beat Delhi With Six Wickets in Visakhapatnam - Sakshi

ఢిల్లీపై విజయంతో ఫైనల్‌కు

క్వాలిఫయర్‌–2లో చతికిలపడిన ‘క్యాపిటల్స్‌’

విశాఖను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ పోరు

ఇటు స్టేడియం.. అటు హైవేలో జనమే జనం

మ్యాచ్‌ ఆద్యంతం ధోనీసేనకు నీరాజనం

విశాఖ స్పోర్ట్స్‌ :అనుకోని వరంతో పరవశించిన విశాఖ ఆనందోత్సాహాల తరంగమే అయింది. మండే ఎండాకాలంలో మురిపించిన విరివానలా వచ్చిన ఐపీఎల్‌ సంరంభం పులకింపజేస్తే.. ఆ జల్లుల్లో నిలువెల్లా తడిసి తన్మయంతో ఆడిపాడింది. టోర్నీమెంట్‌ రెండో క్వాలిఫయర్‌లో ఎదురులేని చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను నిండు గుండెతో స్వాగతించింది. ధోనీ అంటే తరగని మక్కువ గల వైజాగ్‌ క్రీడాభిమాన గణం ఆ అభిమానం ఏ సందర్భంలోనైనా తరగని గని వంటిదని నిరూపించింది. ప్రేక్షకాదరణను దండిగా పొందిన ధోనీ సేన ఆడుతూ పాడుతూ ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన తరుణాన్ని విశాఖ ఓ పండగలా ఎంజాయ్‌ చేసింది.

ఎలిమినేటర్‌లో మాదిరిగా వైఎస్సార్‌ స్టేడియంలో ఉత్సాహం, ఉల్లాసం జతకట్టి కేరింతలు కొడితే.. ఆటలో ఆనందాన్ని మించి ఐపీఎల్‌ మజాను విశాఖ ఆస్వాదించింది. బుధవారం నాటి మ్యాచ్‌లో దూసుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు క్వాలిఫయిర్‌లో తేలిపోవడంతో.. సెమీ ఫైనల్‌ వంటి కీలక మ్యాచ్‌ ఏకపక్షమే అయింది. చెన్నై సింహం జూలు విదిల్చి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన వైనాన్ని పక్కన పెడితే.. శుక్రవారం రాత్రి సందడిగా సాగింది. నెరవేరని ఆశతో ఢిల్లీ నిరాశ పడినా.. సముచితమైన జట్టే తుదిపోరుకు తరలుతోందన్న సంతృప్తితో విశాఖ వీరాభిమానుల దండు ఇళ్లకు మరలింది. కీలకమైన ప్లే ఆఫ్‌ను అద్భుతంగా నిర్వహించి విశాఖ అందరి హృదయాలనూ చూరగొంది. ముఖ్యంగా సీఎస్కే సారథి ధోనీ మనసును మరోసారి సాగర నగరి గెలుచుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top