చండీలాపై జీవిత కాల నిషేధం | Sakshi
Sakshi News home page

చండీలాపై జీవిత కాల నిషేధం

Published Tue, Jan 19 2016 2:59 AM

చండీలాపై జీవిత కాల నిషేధం

హికేన్ షాపై ఐదేళ్లు
బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం

 ముంబై: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆఫ్ స్పిన్నర్ అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధం విధించారు. సోమవారం శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే సహచర ఆటగాడిని ఫిక్సింగ్ కోసం సంప్రదించినందుకు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2013లో జరిగిన ఐపీఎల్ ఎనిమిదో సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చండీలా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పేలవ ప్రదర్శన కనబరచడం, మరో ఆటగాడితో ఫిక్సింగ్ చేయించాలని ప్రయత్నించిన ఆరోపణల్లో దోషిగా తేలడంతో బోర్డు కఠిన చర్య తీసుకుంది.

‘బీసీసీఐ అవినీతి వ్యతిరేక కోడ్‌లోని పలు నిబంధనల ప్రకారం చండీలాపై జీవిత కాల నిషేధం విధించాం. ఇక తను బోర్డుకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. దేశవాళీల్లో సహచర ఆటగాడిని ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేసినందుకు హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం పడింది. క్రికెట్‌లో స్వచ్ఛత కోసం మేం పాటుపడుతున్నాం. ఎలాంటి అవినీతి చర్యలకు దిగినా పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

మరోవైపు పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించేందుకు సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఈ విచారణ నిస్పాక్షికంగా జరగడం లేదని, తిరిగి మరో విచారణ అధికారి ఆధ్వర్యంలో మొదటినుంచి జరపాలని లేఖ రాశారు. అయితే కమిటీ దీన్ని తిరస్కరించింది. వచ్చే నెల 9లోగా ఫిక్సింగ్ ఆరోపణలపై రాతపూర్వక సమాధానాన్ని పంపించేందుకు ఆయనకు ఆఖరి అవకాశాన్నిస్తున్నట్టు పేర్కొంది. అదే నెల 12న రవూఫ్‌పై నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
 

Advertisement
Advertisement