టైటిల్‌ పోరుకు టీమిండియా

Champions Trophy Hockey Tournament india Final - Sakshi

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ డ్రా

చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ  

బ్రెడా (నెదర్లాండ్స్‌): చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం ఆతిథ్య నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ 1–1 స్కోరుతో ‘డ్రా’ అయింది. ఫైనల్‌ చేరేందుకు కనీసం ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచేందుకు చోమటోడ్చింది. చివరకు ‘డ్రా’ ఫలితంతో తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున మన్‌దీప్‌ సింగ్‌ (47వ నిమిషంలో) గోల్‌ చేయగా, తియెరి బ్రింక్‌మన్‌ (55వ ని.) నెదర్లాండ్స్‌కు గోల్‌ అందించాడు. తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ హర్మన్‌ప్రీత్, సునీల్‌ వాటిని గోల్స్‌గా మలచలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ఆకట్టుకున్నాడు. రెండో క్వార్టర్లో ప్రత్యర్థి జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. ఇందులో ఏ ఒక్కటి గోల్‌ అయినా భారత్‌ పరిస్థితి క్లిష్టంగా ఉండేది.  ఆరు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది. టోర్నీ నిబంధనల ప్రకారం టాప్‌–2 జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–3తో ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనా చేతిలో ఓడింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది.

రాత్రి గం. 7.30కు మొదలయ్యే ఈ ఫైనల్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top