హాకీ ప్రపంచకప్‌ కోసం  పాకిస్తాన్‌ జట్టుకు లైన్‌ క్లియర్‌ | Sakshi
Sakshi News home page

హాకీ ప్రపంచకప్‌ కోసం  పాకిస్తాన్‌ జట్టుకు లైన్‌ క్లియర్‌

Published Tue, Nov 13 2018 12:41 AM

Cash-strapped Pakistan hockey finally finds sponsor, World Cup doubts over  - Sakshi

కరాచీ: ఆర్థిక సమస్యలతో భారత్‌లో జరిగే హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనడం సందేహంగా మారిన పాకిస్తాన్‌ జట్టుకు ఊరట లభించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ‘హైయర్‌’ పాక్‌ హాకీ జట్టుకు 2020 వరకు స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు ముందుకు వచ్చింది. అంతర్జాతీయ పర్యటనలతో పాటు దేశంలో కూడా హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని ‘హైయర్‌’ ఎండీ జావేద్‌ అఫ్రిది ప్రకటించారు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఒక జట్టయిన పెషావర్‌ జల్మీకి అఫ్రిది యజమాని కూడా. ఇటీవల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొన్న ఆటగాళ్లకు దినసరి భత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పాక్‌ హాకీ సమాఖ్య ఉండటంతో ఆ జట్టు వరల్డ్‌ కప్‌కు దాదాపుగా దూరమైంది.

తమకు ఆదుకోవాలని పాక్‌ క్రికెట్‌ బోర్డును కోరినా... పాత అప్పులే తీర్చలేదంటూ పీసీబీ తిరస్కరించడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. ఈ దశలో దిగ్గజ ఆటగాడు షహబాజ్‌ అహ్మద్‌ చొరవతో ఆ జట్టుకు స్పాన్సర్‌షిప్‌తో పాటు పాత బకాయిలు తీర్చేందుకు అవకాశం లభించింది. మరోవైపు తమకు సాయం అందించాలంటూ పాక్‌ హాకీ సమాఖ్య చేసిన విజ్ఞప్తికి ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం!    

Advertisement
Advertisement