‘వివో’ వల్ల మనకే లాభం!

CAIT steps up campaign against Chinese goods - Sakshi

చైనా కంపెనీ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐ

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్‌లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్‌లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సమాధానమిచ్చారు.

‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది.

అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్‌ స్పాన్సర్‌ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్‌కాట్‌ చేస్తామని తెలిపింది.  చైనా స్పోర్ట్స్‌ పరికరాల కంపెనీ ‘లి–నింగ్‌’ భారత ఆటగాళ్లకు కిట్‌ స్పాన్సర్‌గా ఉందని, టోక్యో ఒలింపిక్స్‌ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్‌ బాడీ మీటింగ్‌లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top