
పాకిస్తాన్ తెరచాటు యుద్ధం కూడా సమస్యాత్మకమే
పొరుగు దేశాల్లోఅస్థిరత మనకు ఆందోళనకరం
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల తర్వాత చైనాతో భారత్ బంధం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదమేనని చెప్పారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ చేసున్న తెరచాటు యుద్ధం కూడా మనకు సమస్యాత్మకంగానే మారిందని తెలిపారు.
మన రెండు ప్రత్యర్థి దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలేనని గుర్గుచేశారు. ఆయా దేశాలకు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహించే విషయంలో వాటివద్దనున్న అణ్వా్రస్తాలు మనకు ఒక సవాల్‌గానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో శుక్రవారం ఓ కార్యక్రమంలో అనిల్ చౌహాన్ మాట్లాడారు. పొరుగు దేశాల్లో అస్థిర పరిస్థితులు నెలకొనడం భారత్‌కు ఆందోళనకరమేనని చెప్పారు.
అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన అస్థిరత, అశాంతి ఏర్పడిందని పేర్కొన్నారు. భారత్‌ను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ వ్యవహరిస్తోందని వెల్లడించారు. వెయ్యి సార్లు యుద్ధం చేసైనా భారత్‌కు గాయపర్చాలన్నది పాకిస్తాన్ విధానమని చెప్పారు. ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెరచాటు యుద్ధం చేస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై మనమే పైచేయి సాధించామన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పకుండా భారత సైనిక దళాల చేతులు కట్టేశారంటూ వస్తున్న ఆరోపణలను అనిల్ చౌహాన్ ఖండించారు. మన సైన్యానికి ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని స్పష్టంచేశారు. దాడులకు ప్లానింగ్‌తోపాటు లక్ష్యాలను నిర్దేశించుకోవడాన్ని మన దళాలకే అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాక్‌పై కేవలం ప్రతీకార దాడి కాదని.. మన సహనానికి రెడ్ లైన్ ఏమిటో ప్రత్యర్థికి చూపించడమేనని వ్యాఖ్యానించారు. ఆ రెడ్ లైన్ దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్‌కు తెలిసొచ్చిందని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో యుద్ధక్షేత్రాల్లోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అనిల్ చౌహాన్ చెప్పారు.
ఆధునిక కాలంలో యుద్ధరీతులు నానాటికీ మారిపోతున్నాయని, హైటెక్నాలజీ రంగ ప్రవేశం చేస్తోందని అన్నారు. సైబర్, అంతరిక్ష యుద్ధాలు కూడా జరుగుతాయన్నారు. సవాళ్లు అనేవి ఈ క్షణానికి సంబంధించినవి కాదని... అవి భిన్న కాలాల్లో భిన్న రూపాల్లో ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎలాంటి సవాల్ అయినాసరే ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.