breaking news
problematic
-
చైనాతో సరిహద్దు వివాదమే అతిపెద్ద సవాల్
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల తర్వాత చైనాతో భారత్ బంధం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదమేనని చెప్పారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ చేసున్న తెరచాటు యుద్ధం కూడా మనకు సమస్యాత్మకంగానే మారిందని తెలిపారు. మన రెండు ప్రత్యర్థి దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలేనని గుర్గుచేశారు. ఆయా దేశాలకు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహించే విషయంలో వాటివద్దనున్న అణ్వా్రస్తాలు మనకు ఒక సవాల్‌గానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో శుక్రవారం ఓ కార్యక్రమంలో అనిల్ చౌహాన్ మాట్లాడారు. పొరుగు దేశాల్లో అస్థిర పరిస్థితులు నెలకొనడం భారత్‌కు ఆందోళనకరమేనని చెప్పారు. అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన అస్థిరత, అశాంతి ఏర్పడిందని పేర్కొన్నారు. భారత్‌ను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ వ్యవహరిస్తోందని వెల్లడించారు. వెయ్యి సార్లు యుద్ధం చేసైనా భారత్‌కు గాయపర్చాలన్నది పాకిస్తాన్ విధానమని చెప్పారు. ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెరచాటు యుద్ధం చేస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై మనమే పైచేయి సాధించామన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పకుండా భారత సైనిక దళాల చేతులు కట్టేశారంటూ వస్తున్న ఆరోపణలను అనిల్ చౌహాన్ ఖండించారు. మన సైన్యానికి ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని స్పష్టంచేశారు. దాడులకు ప్లానింగ్‌తోపాటు లక్ష్యాలను నిర్దేశించుకోవడాన్ని మన దళాలకే అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాక్‌పై కేవలం ప్రతీకార దాడి కాదని.. మన సహనానికి రెడ్ లైన్ ఏమిటో ప్రత్యర్థికి చూపించడమేనని వ్యాఖ్యానించారు. ఆ రెడ్ లైన్ దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్‌కు తెలిసొచ్చిందని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో యుద్ధక్షేత్రాల్లోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అనిల్ చౌహాన్ చెప్పారు. ఆధునిక కాలంలో యుద్ధరీతులు నానాటికీ మారిపోతున్నాయని, హైటెక్నాలజీ రంగ ప్రవేశం చేస్తోందని అన్నారు. సైబర్, అంతరిక్ష యుద్ధాలు కూడా జరుగుతాయన్నారు. సవాళ్లు అనేవి ఈ క్షణానికి సంబంధించినవి కాదని... అవి భిన్న కాలాల్లో భిన్న రూపాల్లో ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎలాంటి సవాల్ అయినాసరే ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. -
సమస్యాత్మక గ్రామాల్లో ఆర్ఏఎఫ్ బృందం సర్వే
ఒంగోలు క్రైం : జిల్లాలో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక, సామాజిక, మత సంబంధ గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బృందం సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్- 99 ఆర్ఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ హెచ్‌పీ సింగ్ నేతృత్వంలోని 70 మందితో కూడిన బృందం జిల్లాలో పర్యటించేందుకు మంగళవారం ఒంగోలు చేరుకుంది. అసిస్టెంట్ కమాండెంట్ కె.పాపారావుతో పాటు ఆర్ఏఎఫ్ బృందం ఒంగోలు డీఎస్పీ పి.జాషువాను ఆయన కార్యాలయంలో కలిసింది. ఒంగోలు పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. సింగరాయకొండ, కొత్తపట్నం, మర్రిపూడి, జరుగుమల్లి, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలతో పాటు ఒంగోలు నగరంలోని ప్రాంతాలకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నుంచి సేకరించింది. సామాజిక ఘర్షణలు జరుగుతున్న గ్రామాలను సైతం పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు సర్వే దోహదపడుతుందని డిప్యూటీ కమాండెంట్ హెచ్‌పీ సింగ్ వివరించారు. 70 మంది ప్రత్యేక పోలీసులు వారం పాటు జిల్లా మొత్తం పర్యటించి సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వాటి పరిసరాలపై కూడా పూర్తి స్థాయి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు సింగ్ చెప్పారు. -
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన పోలీసులు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక సమరానికి పోలీసుశాఖ సిద్ధమైంది. మున్సిపల్, స్థానిక ఎన్నికలు కొద్దిపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతుండడంతో పోలీసులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలీసులు గస్తీ తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల్లో అరాచకాలు సృష్టించే వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత నేరస్థులను గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అతి సమస్యాత్మక కేంద్రాల్లో నిఘా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 9,400 మంది సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలోని 2,318 పోలింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయనుంది. 2,318 పోలింగ్ కేంద్రాల్లో 301 అతి సమస్యాత్మకమైనవిగా, 292 సమస్యాత్మకం, 93 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. స్థానిక పోలీసులు, నిఘా వ్యవస్థ అధికారులు తయారు చేసిన ప్రత్యేక రిపోర్టు ఆధారంగా ఈ కేంద్రాలను గుర్తించారు. రోజు ఈ ప్రాంతాల్లో పోలీసు ప్లాగ్మార్చ్లు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చేసే వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 45 చెక్‌పోస్టులో డీఎస్పీలు రోజు తనిఖీలు చేసేలా ప్రత్యేక ఫ్లయింగ్స్క్వాడ్లు ఏర్పాటు చేసుకోనున్నారు. జిల్లా పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులకు రానున్నాయి. కాగా, పోలీసు బలగాలు ఇలా ఉన్నాయి. ఎస్పీ ఒక్కరు, ఏఎస్పీలు నలుగురు, డీఎస్పీలు 16, సీఐలు 60, ఎస్సైలు 240, ఏఎస్సైలు 180, హెడ్‌కానిస్టేబుళ్లు 800, కానిస్టేబుళ్లు 5 వేలు, మహిళ పోలీసులు 150, హోంగార్డులు 800, ఫారెస్టు, ఎక్సైజ్ సిబ్బంది 350, ఏపీఎస్పీ బలగాలు 600, సీఆర్పీఎఫ్ 400, ఐటీబీపీ ఫోర్స్ 400, సీఏపీఎప్ ఫోర్స్ 400 బలగాలు ఉన్నాయి. జిల్లాకు కర్నూల్ పోలీసులు తెలంగాణలో ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు మొదటి విడతగా నిర్వహిస్తుండడంతో ఇక్కడికి సీమాంధ్ర పోలీసు బలగాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు కర్నూల్ నుంచి 2,900 మంది పోలీసులు బందోబస్తుకు రానున్నాయి. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించడంతో ఇక్కడి పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు పోలీసు బందోబస్తు కొరత ఉండడంతో కర్నూల్ జిల్లా నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. వీరిలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, మిగతా వారు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు. మొత్తం 9,400 మంది సిబ్బందిలో కేంద్ర బలగాలు, ఇండోటిబెట్ బార్డర్ పోలీసు ఫోర్సు బలగాలు ఉన్నాయి. ఇప్పటికే ఎక్సైజ్, ఫారెస్టు శాఖల సిబ్బందిని బందోబస్తుకు వినియోగించుకుంటున్న పోలీసుశాఖ వీరితోపాటు అదనంగా 2వేల మంది ఎన్సీసీ కేడెట్లను బందోబస్తుకు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్.. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం కదలికలు ఉండే అవకాశాలు ఉన్నందున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావం ఉన్న జిల్లాలో ఆదిలాబాద్ కూడా ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు నిర్ధారించారు. ఎన్నికలకు మరో పది రోజులు సమయం ఉండడంతో సరిహద్దు ప్రాంతాలను పోలీసులు జల్లేడ పడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నాయకుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు ప్రచార సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిలబడ్డ అభ్యర్థులు ప్రచారానికి వెళితే ఏం జరుగుతోందోని ఆందోళన వీరిలో ఉంది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లే రాజకీయ నాయకులకు భద్రత కల్పించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు ఉన్నత అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు సైతం నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సంచరిస్తున్నారు. ఏదేమైన జరిగిన రెండు ఎన్నికలు ఒక ఎత్తై ఈ సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు సవాలుగా మారింది. -
దాడులకు వ్యూహం !
భద్రాచలం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారనున్నాయి. ఎన్నికల వేళ విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహ రచన చేస్తున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలు ఇక్కడి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేయటమే లక్ష్యంగా మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి భద్రాచలం మండలం గన్నవరంలో సెల్ టవర్‌ను దగ్ధం చేశారని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సరిహద్దు అటవీ ప్రాంతాలకే పరిమితమైన మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లోనూ సంచరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌టవర్ దగ్ధం చేసిన గన్నవరం భద్రాచలానికి 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అర్ధరాత్రి వేళ సాయుధ నక్సల్స్ పెద్ద సంఖ్యలో రావడమే కాక సెల్‌టవర్ సామగ్రి పూర్తిగా కాలిపోయేంత వరకూ అక్కడే ఉన్నారని గ్రామస్తులు చెపుతున్నారు. పట్టణ పరిసర గ్రామాల్లో కూడా మావోయిస్టుల హల్చల్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వేసి ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఎలాంటి విధ్వంసాలకు దిగలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇలాంటి క వ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. దీంతో ఈ నెల 30న జరిగే ఎన్నికలు అధికారులకు కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు అంటున్నారు. సమాచార వ్యవస్థే టార్గెట్... సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లపై దాడులే లక్ష్యంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలోని వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు. 26 పోలింగ్ స్టేషన్ లకు సెల్‌సిగ్నల్స్ లేకపోవటంతో అక్కడ ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఈనెల 6న జరిగిన స్థానిక ఎన్నికలలో చింతూరు మండలంలోని గూడూరు రూట్‌కు బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు వెళ్లిన బస్సు సమయానికి రాకపోవటం తీవ్ర సంచలనం కలిగించింది. పోలింగ్ స్టేషన్ వద్దనే గంట పాటు ఉండిపోగా, కమ్యూనికేషన్ లేకపోవటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. అసలే పరిస్థితి ఇలా ఉంటే గన్నవరంలో సెల్ టవర్ పేల్చివేతతో కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత చిన్నాభిన్నమైంది. మావోయిస్టులు పేల్చిన టవర్‌పై ఎయిర్టెల్, వొడాఫోన్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. అంతేకాకుండా భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఉన్న 19 టవర్లు దీనికి అనుసంధానంగా ఉన్నాయి. ఎన్నికల నాటికి దీన్ని పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో భద్రాచలమే సమస్యాత్మకం... మొదటి విడత ఎన్నికల జరిగే తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భద్రాచలమే అత్యంత సమస్యాత్మకమైనదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నియోజకవర్గంలోని 261 పోలింగ్ స్టేషన్లకు గాను 156 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ కారణంతోనే భద్రాచలం, వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాలో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన మూడు డివిజన్లలో భద్రాచలం నియోజకవర్గంలోనే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మావోయిస్టుల కార్యకలాపాలు, పోలింగ్ సమయం కుదించటంతో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింతగా తగ్గవచ్చని పరిశీలకులు అంటున్నారు.