
బుమ్రా
సెయింట్ మోరిట్జ్ (స్విట్జర్లాండ్): భారత పేస్ బౌలర్ల ఇటీవలి ప్రదర్శన పాకిస్తాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్‌ను కూడా ఆకట్టుకుంది. గతంతో పోలిస్తే ఈ తరం భారత పేస్ విభాగం చాలా బాగుందని అతను కొనియాడాడు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా బౌలర్లు విజృంభిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ‘బుమ్రా కౌంటీ క్రికెట్ ఆడితే మరింత మెరుగవుతాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై అనుభవం ఉంటేనే కచ్చితత్వంతో బంతులు వేయగలడు.
ఐపీఎల్ సమయంలో కనీసం ఒక నెలపాటు అతడిని కౌంటీ క్రికెట్ ఆడేలా బీసీసీఐ అనుమతిస్తే బుమ్రా మరింత రాటుదేలుతాడు. టీ20 స్పెషలిస్టుగా క్రికెట్‌లో అడుగుపెట్టి టెస్టు ఫార్మాట్లో రాణించాలంటే కాస్త సమయం పడుతుంది. నా దృష్టిలో భువనేశ్వర్ అత్యుత్తమ బౌలర్. దక్షిణాఫ్రికాలో అతడి ప్రదర్శన అసాధారణం. ప్రస్తుత పేస్ దళం ఇంగ్లండ్‌లో రాణించగలదు’ అని అక్రమ్ తెలిపాడు.