‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

Bipin Rawat Says Dhoni Doesnt Need Protection - Sakshi

న్యూఢిల్లీ: దేశ రక్షణలో భాగమైన  సైనికుడికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరంలేదని.. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా నిలవాలని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనిని ఉద్దేశించి పేర్కొన్నారు. రెండు నెలల సైనిక శిక్షణను ధోని గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి ఆగస్ట్‌ 15 వరుకు కశ్మీర్‌ లోయలో విధులు నిర్వర్తించనున్నాడు. ఈ సందర్భంగా బిపిన్‌ రావత్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధోని ట్రైనింగ్‌ ప్రారంభమైంది. 106 టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరాడు. కశ్మీర్‌లో విక్టర్‌ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్‌లో ఈ బెటాలియన్ పని చేయనుండగా.. వారితో పాటే ధోని కూడా ఉండనున్నారు.

కమ్యూనికేషన్‌, స్టాటిక్‌ రక్షణలో  ఈ బెటాలియన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ బెటిలియన్‌లోనే ధోని పని చేయడం అతడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ధోనికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటుచేయలేదు. మామూలు సైనికుడికి ఎలాంటి సదుపాయాలు అందిస్తామో ధోనికి కూడా అవే లభిస్తాయి. ఇక ధోని కోసం ప్రత్యేక రక్షణ కల్పించము. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా ఉంటాడు’అంటూ బిపిన్‌ రావత్‌ వివరించారు. 

ఇక ప్రపంచకప్‌ అనంతరం క్రికెట్‌కు రెండు నెలల పాటు సెలవు తీసుకున్న ధోని.. ఆర్మీకి సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కూడా అనుమతించడంతో ధోని ఆర్మీ ట్రైనింగ్‌కు మార్గం సుగుమమైంది. ‘ధోనిలాంటి భారత క్రికెట్‌ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్‌ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించిన విషయం తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top