టీకా వస్తేనే ఆటలకు మేలు 

Better To Play After Vaccination Comes For Covid 19 Says Sai Praneeth - Sakshi

బ్యాడ్మింటన్‌ స్టార్‌ సాయిప్రణీత్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వైరస్‌కు టీకా అందుబాటులోకి వచ్చాకే క్రీడా ఈవెంట్లను ప్రారంభించాలని భారత స్టార్‌ షట్లర్‌ సాయిప్రణీత్‌ అభిప్రాయపడ్డాడు. ఆ టీకాకు  ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ఆమోదం ఉంటే క్రీడాకారులు ధైర్యంగా పోటీల్లో పాల్గొనగలరని పేర్కొన్నాడు. పరిస్థితులు సద్దుమణిగినా కూడా... వ్యాక్సినేషన్‌ లేకుంటే అందరిలో కరోనా భయం తొలగిపోదన్నాడు. ‘వాడా నిషేధించిన డ్రగ్స్‌ లేకుండా టీకా ఉంటే క్రీడాకారులకు మంచిది. లేకపోతే ప్లేయర్ల భవిష్యత్‌ కష్టాల్లో పడుతుంది.

టీకా లేకుండా పరిస్థితులు కచ్చితంగా మన చేతుల్లోకి రావు. ఆటగాళ్లు తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కరోనా మొత్తం తగ్గిన తర్వాత కూడా చైనా, కొరియా లాంటి దేశాలకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ప్రయాణాల్లో, బ్యాడ్మింటన్‌ కోర్టుల్లో ప్రతీసారి, ప్రతీచోటా సామాజిక దూరం పాటించడం కుదరదు. కొన్నిచోట్ల వైరస్‌ తగ్గినట్లే తగ్గి తిరగబెడుతోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో టీకా లేకుండా టోర్నీలు ఆడటం సాహసమే. ఇప్పుడిప్పుడే టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ వరకు బ్యాడ్మింటన్‌ టోర్నీలు ఉండకపోవచ్చు’ అని ఈ హైదరాబాదీ ప్లేయర్‌ వివరించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top