బెస్ట్‌ బౌలింగ్‌ Vs బెస్ట్‌ బ్యాటింగ్‌

The Best Batting Lineup The Best Bowling Line Up this IPL - Sakshi

ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌, చెన్నై మ్యాచ్‌

భారీగా తరలివచ్చిన అభిమానులు 

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ సీజన్‌–11లో పటిష్ట బౌలింగ్‌ వనరులు కలిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. బెస్ట్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయం స్టేడియం వేదికగా.. మరి కొద్ది క్షణాల్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అభిమానులు అధిక సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. ఆదివారం కావడంతో ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే హెచ్‌సీఏ మ్యాచ్‌ ఏర్పాట్లను పూర్తి చేసింది. మ్యాచ్‌ నేపథ్యంలో ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

నేలకు కొట్టిన బంతిలా..
గత మ్యాచ్‌లో గేల్‌ ధాటికి కుదేలైన రైజర్స్‌ బౌలింగ్‌ విభాగం నేలకు కొట్టిన బంతిలా.. తిరిగి పుంజుకొని సత్తా చాటాలని చూస్తోంది. సీజన్‌ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన హైదరాబాద్‌ గత మ్యాచ్‌లో గేల్‌ సెంచరీతో విరుచుకుపడటంతో తొలి ఓటమిని చవిచూసింది. దీంతో తిరిగి గాడిన పడి చెన్నైపై ఆధిపత్యం చూపాలని తహతహలాడుతోంది. భువనేశ్వర్, రషీద్‌ ఖాన్, సిద్ధార్థ్‌ కౌల్, స్టాన్‌లేక్, షకీబుల్‌ హసన్‌లతో రైజర్స్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా... బ్యాటింగ్‌లో ముందుండి నడిపించే వారు కరువవడం ఇబ్బందిగా మారింది.
శిఖర్‌ మెరిస్తే..
కెప్టెన్‌ విలియమ్సన్‌ సాధికారిక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా... భారీ స్కోర్లు చేయడానికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. శిఖర్‌ ధావన్, మనీశ్‌ పాండే, హేల్స్, సాహా, యూసుఫ్‌ పఠాన్, షకీబ్‌ చెలరేగితే సన్‌రైజర్స్‌కు ఎదురుండదు. మరోవైపు గత మ్యాచ్‌లో భారీ విజయంతో జోరు మీద ఉన్న చెన్నై... అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌పై మెరుపు శతకంతో చెలరేగిన వాట్సన్‌తో పాటు రైనా, ధోని, రాయుడు, బిల్లింగ్స్, బ్రేవో, జడేజాలతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top