
న్యూఢిల్లీ: పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తాపై బీసీసీఐ 8 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. 27 ఏళ్ల పంజాబ్ ఆటగాడు నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో సస్పెండ్ చేశారు. ఈ మేరకు జనవరి నిర్వహించిన బీసీసీఐ డోపింగ్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో అభిషేక్ నిషేధిత ఉత్పేరకం వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
దాంతో అతనిపై 8 నెలల నిషేధం విధించింది. అయితే దగ్గు టానిక్‌లో ఉండే ఉత్ప్రేరకాన్ని తను డాక్టర్ సూచన మేరకే వాడినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణతో నిషేధాన్ని 8 నెలలకే పరిమితం చేసింది. ఈ నిషేధం జనవరి 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 14 తేదీ వరకూ అమల్లో ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇలా డోపింగ్ పాల్పడిన తొలి పంజాబ్ క్రికెటర్‌గా అభిషేక్ కావడం గమనార్హం.