దాగుడుమూతలు

BCCI hidden wounds Indian players - Sakshi

భారత ఆటగాళ్ల   గాయాలను దాచిపెట్టిన బీసీసీఐ

సాహా భుజానికి శస్త్రచికిత్స అవసరం

సుదీర్ఘ కాలం ఆటకు దూరం

స్వదేశానికి భువనేశ్వర్‌

టీమిండియా టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయాలాపన వేలి నుంచి భుజానికి చేరింది. బొటన వేలికి దెబ్బ తగిలిందని ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్న అతడు... ఎన్‌సీఏ పునరావాస శిబిరానికి వెళ్లాక భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోండటం ఆశ్చర్యపరుస్తోంది. అసలు అతడి గాయం తీవ్రత ఏమిటి? కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది? అనే విషయాలపై బీసీసీఐకి స్పష్టత ఇవ్వలేకపోయిన ఎన్‌సీఏ వద్దకే... ఇప్పుడు పేసర్‌ భువనేశ్వర్‌ను పునరావాసానికి పంపుతుండటం విస్తుగొలుపుతోంది. 

సాక్షి క్రీడా విభాగం: అన్నీ సరిగా ఉంటే ఈపాటికి ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు బయల్దేరాల్సిన వృద్ధిమాన్‌ సాహా... ఇప్పుడు అదే దేశానికి శస్త్ర చికిత్సకు వెళ్లనున్నాడు. రెండు నెలలుగా వేలి గాయం అని చెబుతున్నా, అది భుజం గాయంగా తేలింది. దీంతో రానున్న ఐదు టెస్టుల సిరీస్‌ మొత్తానికి, ఆస్ట్రేలియా పర్యటనకూ అతను దూరమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) పునరావాస శిబిరంలో ఉండగానే సాహాకు ఈ పరిస్థితి ఎదురవడం గమనార్హం. ‘అతడి గాయం తీవ్రమైనదని ఎన్‌సీఏ ఫిజియో ప్రకటించారు. వచ్చే నెలలో బ్రిటన్‌లో శస్త్ర చికిత్స జరుగనుంది. అది మాత్రమే తనను మళ్లీ ఆటలోకి తీసుకురాగలదు. అనంతరం కనీసం రెండు నెలలైనా బ్యాట్‌ పట్టుకోలేడు. తర్వాతే పునరావాస సన్నాహం మొదలవుతుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే, సాహా ఫిట్‌నెస్‌ సమస్యలపై ఇప్ప టివరకు బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం ఓ సంగతైతే, వేలి గాయం నుంచి కోలుకోనందున అతడిని ఇంగ్లండ్‌ పర్యటనలోని మొత్తం ఐదు టెస్టులకు ఎంపిక చేయలేదని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మేస్కే ప్రసాద్‌ చెప్పడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. 

అంతా అస్పష్టతే! 
సాహాకు భుజం సమస్య ఎన్‌సీఏలోనే తలెత్తినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో క్యాచ్‌ పడుతూ భుజం నొప్పికి గురైనా చిన్నదేనని సరిపెట్టుకున్నాడు. తొడ కండరాల కారణం చూపుతూ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడుతూ వేలి గాయానికి గురయ్యాడు. ఎన్‌సీఏలో ఉపశమనం పొంది ఇంగ్లండ్‌ వెళ్లొచ్చని భావిస్తే అది ఇంతవరకు తెచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అక్కడి ఫిజియో పనితీరు ప్రశ్నార్థకం అవుతోంది. గతంలో భారత జట్టుతోనూ పని చేసిన ఎన్‌సీఏ ఫిజియో తాజా పరిస్థితిపై బోర్డుకు నివేదిక ఇవ్వడం కాని, కనీసం సెలక్షన్‌ కమిటీ కన్వీనర్, బోర్డు కార్యదర్శి అయిన అమితాబ్‌ చౌదరికి సమాచారం చేరవేయడం కానీ చేసినట్లు లేడు. ఒకవేళ చెప్పి ఉంటే, బుధవారం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడు సాహా రెండు నెలలు అందుబాటులో ఉండడని ప్రకటన చేసేవారు కాదు. ఇది జట్టు ఎంపికకు ముందు కన్వీనర్‌కు పూర్తి సమాచారం అందలేదనే సంగతిని చాటుతోంది. వేలి గాయం నుంచి సాహా కోలుకున్నట్లు తొలుత ప్రకటించిన బీసీసీఐ వర్గాలే... ఇప్పుడు అదేమీ చిన్న గాయం కాదని, మేజర్‌ శస్త్రచికిత్స అవసరమని, అతడి పునరాగమనంపై కచ్చితమైన తేదీ చెప్పలేమని అంటున్నా యి.  సాహా సంగతి అటుంచితే, ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు కీలకమైన పేసర్‌ భువనేశ్వర్‌ సేవలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ఎన్‌సీ ఏలో ఏం జరుగుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్కడి పునరావాసం తీరుపై ఆటగాళ్లు కూడా చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. దాదాపు నెల నుంచి సాహా అక్కడే ఉన్నా... పరిస్థితిని అంచనా వేసి శస్త్రచికిత్సకు సూచించకపోవడం, పూర్తిస్థాయి మీడియా విభాగం ఉన్న బీసీసీఐకి కాంట్రాక్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి నివేదిక ఇవ్వకపోవడం ఎన్‌సీఏ లోపంగానే తేలుతోంది. వారి నిర్వాకం కారణంగా దేశంలోనే నంబర్‌వన్‌ టెస్టు కీపర్‌ అయిన సాహా ఎంతో కీలకమైన రెండు సిరీస్‌లకూ దూరమయ్యాడు. సుదీర్ఘ కాలం విరామంతో ఓ విధంగా తన కెరీర్‌ కూడా ప్రశ్నార్థకంగా మారింది. 

భువనేశ్వర్‌ను ఏం చేస్తారో! 
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భువనేశ్వర్‌ను చూస్తే అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని అర్ధమవుతోంది. బ్యాటింగ్‌లో గంట పాటు క్రీజ్‌లో ఉండటంతో తన బౌలింగ్‌ పస లేకుండా సాగింది. ఒక సునాయాస క్యాచ్‌ కూడా వదిలేశాడు. దీనికి ఫిట్‌నెస్‌ లోపమే కారణం. తనను బరిలో దింపడాన్ని కెప్టెన్‌ కోహ్లి సమర్థించుకున్నా అది అనవసర కూర్పే. అయితే, సాహా–భువీ విషయంలో ఓ సామీప్యత కనిపిస్తోంది. ఇద్దరూ ఐపీఎల్‌లో ఇబ్బంది పడి విరామం తీసుకున్నారు. భువనేశ్వర్‌ మాత్రం చాలా అవసరమైన సమయంలో జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌ నుంచి తిరిగొస్తున్న అతడిని కూడా నాలుగు వారాల పాటు పునరావాసం కోసం ఎన్‌సీఏకే పంపుతున్నారు. నాణ్యమైన పేసర్‌ అయిన తన విషయంలోనైనా ఎన్‌సీఏ కచ్చితమైన ప్రమాణాలతో గాయాన్ని విశ్లేషించి, వంద శాతం ఫిట్‌నెస్‌తో మైదానంలో దిగేలా చేస్తుందో లేదో చూడాలి. లేదంటే చివరి రెండు టెస్టులకు కూడా భువీ అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమే.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top