
ముంబై : ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు రూ.7.5 లక్షలు చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆగాళ్లకే కాకుండా కోచ్‌లకు సైతం రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సపోర్టింగ్ స్టాఫ్‌కు వేతనంతో సమానమైన నజరానా అందజేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఇక ఆటగాళ్లు అందుకోబోయే నగదు బహుమానం మ్యాచ్ ఫీజుకి సమానం కాగా.. ఆటగాళ్ల కంటే కోచ్‌లకు ఇచ్చే నజరానా ఎక్కువగా ఉండటం గమనార్హం. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా కోహ్లిసేన 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని 72 ఏళ్ల కలను నెరవేర్చిన విషయం తెలిసిందే.