టీ20 సిరీస్‌ ఆడతాం.. టెస్టు సిరీస్‌ వద్దు!

BCB Refuses To Play Tests In Pakistan - Sakshi

ఢాకా:  తమ దేశ పర్యటనలో టెస్టు సిరీస్‌ సైతం ఆడాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చేసిన విన్నపాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తోసిపుచ్చింది. పాకిస్తాన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  వాసిం ఖాన్‌ స్పష్టం చేశారు. తమ దేశంలో టెస్టు సిరీస్‌ ఆడటానికి బంగ్లాదేశ్‌ ఒప్పుకోలేదని తెలిపారు. వారు కేవలం టీ20 సిరీస్‌ ఆడటానికి మాత్రమే మొగ్గుచూపారని, టెస్టు సిరీస్‌ ఆడటానికి ముందుకు రాలేదన్నారు. అయితే తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించడానికి పీసీబీ సుముఖంగా లేదనే విషయాన్ని వాసిం ఖాన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తమ దేశంలోని భద్రతాపరమైన ప్రణాళికల్ని ఇప్పటికే ఐసీసీ అంగీకరించిందని, దీన్ని తమ దేశానికి వచ్చే విదేశీ క్రికెట్‌ బోర్డులు దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. ముందుగా తమ దేశంలో టెస్టు సిరీస్‌ ఆడటానికి బీసీబీ ఆమోదం తెలిపినా, ఆ తర్వాత అందుకు నిరాకరించడం బాధ కల్గించిందన్నాడు. బీసీబీతో ఇంకా చర్చలు జరుపుతున్నామన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్‌ జట్టుముందుగా వన్డే, టీ20  సిరీస్‌లను ఆడింది. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆడిన శ్రీలంక.. మళ్లీ టెస్టు సిరీస్‌ ఆడటానికి పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది.  ఈ తరహాలో బంగ్లాదేశ్‌ కూడా అంగీకారం తెలుపుతుందనే ఆశాభావంతో పీసీబీ పెద్దలు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top