బంగ్లా పైపైకి...

Bangladesh beat Afghanistan by 62 runs - Sakshi

షకీబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

అర్ధ సెంచరీ, ఐదు వికెట్లు

రాణించిన ముష్ఫికర్‌

గెలిచి నిలిచిన బంగ్లాదేశ్‌

అఫ్గానిస్తాన్‌కు ఏడో ఓటమి  

భళారే బంగ్లా! షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మాజీ చాంపియన్లను మించిపోయింది. సఫారీ కంటే ఎన్నో రెట్లు ముందుంది. ఆడుతున్న పది జట్లలో సగం జట్లను కిందికి దించేసింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్‌ రేసులో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్‌ తర్వాతి స్థానం ఇప్పుడు బంగ్లాదేశ్‌దే కావడం విశేషం. పాయింట్ల పట్టికలో బంగ్లా తర్వాతే మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు కొనసాగుతున్నాయి.   

సౌతాంప్టన్‌: మెగా ఈవెంట్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ మళ్లీ చెలరేగాడు. బ్యాట్‌తో, బంతితో అఫ్గానిస్తాన్‌ పని పట్టాడు. దీంతో బంగ్లాదేశ్‌ 62 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. టోర్నీలో మూడో విజయంతో మొర్తజా బృందం టాప్‌–5లోకి వచ్చి సెమీస్‌ రేసులో నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (87 బంతుల్లో 83; 4 ఫోర్లు, 1 సిక్స్‌), షకీబ్‌ అల్‌ హసన్‌ (69 బంతుల్లో 51; 1 ఫోర్‌) రాణించారు. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబుర్‌ రహ్మాన్‌ 3, గుల్బదిన్‌ నైబ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 47 ఓవర్లలో 200 పరుగుల వద్ద ఆలౌటైంది. సమీవుల్లా షిన్వారి (51 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), గుల్బదిన్‌ నైబ్‌ (75 బంతుల్లో 47; 3 ఫోర్లు) అఫ్గాన్‌ పరువు నిలిపారు. అర్ధ సెంచరీతోపాటు స్పిన్‌తో తిప్పేసిన షకీబ్‌ (5/29)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

షకీబ్‌ మరో ఫిఫ్టీ...
టాస్‌ నెగ్గిన అఫ్గానిస్తాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాకు ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (16), తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) శుభారంభం ఇవ్వలేకపోయారు. జట్టు స్కోరు 23 పరుగుల వద్ద దాస్‌ ఔట్‌ కావడంతో తమీమ్‌కు సూపర్‌ ఫామ్‌లో ఉన్న షకీబ్‌ జతయ్యాడు. ఇద్దరు నిలదొక్కుకోవడంతో పరుగుల వేగం క్రమంగా పెరిగింది. ఈ దశలో తమీమ్‌ను నబీ క్లీన్‌  బౌల్డ్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తమీమ్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్, షకీబ్‌తో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 21వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఇద్దరు సమన్వయంతో ఆడటంతో అఫ్గాన్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షకీబ్‌ 66 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో అర్ధసెంచరీ.  

మెరిసిన ముష్ఫికర్‌...
అర్ధసెంచరీ కాగానే బంగ్లా జట్టు స్కోరు 143 పరుగుల వద్ద షకీబ్‌... ముజీబ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. షకీబ్, ముష్ఫికర్‌ మూడో వికెట్‌కు 61 పరుగులు జతచేశారు. తర్వాత సౌమ్య సర్కార్‌ (3) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. దీంతో మహ్ముదుల్లా (38 బంతుల్లో 27; 2 ఫోర్లు) అండతో ముష్ఫికర్‌ 56 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. బౌండరీలు బాదకపోయిన పరుగులను మాత్రం వేగంగా జత చేశాడు. 41వ ఓవర్లో బంగ్లా 200 పరుగులు చేసింది. మహ్ముదుల్లాను నైబ్‌ ఔట్‌ చేయడంతో ముష్ఫికర్‌కు మొసద్దిక్‌ హొస్సేన్‌ జతయ్యాడు. ఇద్దరు స్కోరు వేగం పెంచేందుకు శ్రమించారు. పోరాడే లక్ష్యాన్ని అందించి ఆఖరి ఓవర్లలో నిష్క్రమించారు.

షకీబ్‌ మళ్లీ బంతితో...
తన బ్యాటింగ్‌తో రెండు విలువైన భాగస్వామ్యాలు జోడించిన షకీబ్‌ అల్‌ హసన్‌ బంతితోనూ చెలరేగాడు.  స్పిన్‌ బౌలింగ్‌తో అఫ్గాన్‌ ఆరంభానికి తూట్లు పొడి చాడు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ పది ఓవర్లదాకా వికెట్‌ చేజార్చుకోకుండా 48 పరుగులు చేసింది. ఓపెనర్లు గుల్బదిన్‌ నైబ్, రహ్మత్‌ షా క్రీజులో పాతుకుపోతున్న దశలో షకీబ్‌ దెబ్బతీశాడు. తొలి ఓవర్లోనే (ఇన్నింగ్స్‌ 11వ) రహ్మత్‌ షా (35 బంతుల్లో 24; 3 ఫోర్లు) వికెట్‌ను పడగొట్టాడు. తర్వాత వచ్చిన హష్మతుల్లా షాహిది (11) మొసద్దిక్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.

అస్గర్‌ (38 బంతుల్లో 20; 1 ఫోర్‌) అండతో కెప్టెన్‌ నైబ్‌ జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న నైబ్‌నూ, హార్డ్‌ హిట్టర్‌ నబీ (0)ని ఒకే ఓవర్లో షకీబ్‌ పెవిలియన్‌ చేర్చడంతో అఫ్గాన్‌ కష్టాల్లో పడింది. కాసేపటి తర్వాత అస్గర్‌ను షకీబే ఔట్‌ చేయడంతో 117 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే ఇక్రమ్‌ రనౌట్‌ కావడంతో అఫ్గాన్‌ లక్ష్యానికి దూరమైంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సమీవుల్లా ఆఖరిదాకా పోరాడాడు. అతనికి నజీబుల్లా జద్రాన్‌ (23) కాసేపు అండగా నిలిచినా షకీబ్‌ స్పిన్‌కు తలవంచాడు. సమీవుల్లా అజేయంగా నిలిచినా టెయిలెండర్లు రషీద్‌ ఖాన్‌ (2), దౌలత్‌ జద్రాన్‌ (0), ముజీబ్‌ (0)లను ఔట్‌ చేయడంతో అఫ్గాన్‌ 200 పరుగులకే
ఆలౌటైంది.  

స్కోరు వివరాలు

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) హష్మతుల్లా (బి) ముజీబ్‌ 16; తమీమ్‌ (బి) నబీ 36; షకీబ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్‌ 51; ముష్ఫికర్‌ (సి) నబీ (బి) దౌలత్‌ 83; సౌమ్య సర్కార్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్‌ 3; మహ్ముదుల్లా (సి) నబీ (బి) గుల్బదిన్‌ 27; మొసద్దిక్‌ (బి) గుల్బదిన్‌ 35; సైఫుద్దీన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 262.

వికెట్ల పతనం: 1–23, 2–82, 3–143, 4–151, 5–207, 6–251, 7–262.

బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–39–3, దౌలత్‌ 9–0–64–1, నబీ 10–0–44–1, గుల్బదిన్‌ 10–1–56–2, రషీద్‌ ఖాన్‌ 10–0–52–0, రహ్మత్‌ షా 1–0–7–0.

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుల్బదిన్‌ నైబ్‌ (సి) లిటన్‌ దాస్‌ (బి) షకీబ్‌ 47; రహ్మత్‌ షా (సి) తమీమ్‌ (బి) షకీబ్‌ 24; హష్మతుల్లా (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) మొసద్దిక్‌ 11; అస్గర్‌ అఫ్గాన్‌ (సి) సబ్‌ (షబ్బీర్‌ రహమాన్‌) (బి) షకీబ్‌ 20; నబీ (బి) షకీబ్‌ 0; సమీవుల్లా (నాటౌట్‌) 49; ఇక్రమ్‌ (రనౌట్‌) 11; నజీబుల్లా జద్రాన్‌ (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) షకీబ్‌ 23; రషీద్‌ ఖాన్‌ (సి) మొర్తజా (బి) ముస్తఫిజుర్‌ 2; దౌలత్‌ జద్రాన్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ముస్తఫిజుర్‌ 0; ముజీబ్‌ (బి) సైఫుద్దీన్‌ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్‌) 200.

వికెట్ల పతనం: 1–49, 2–79, 3–104, 4–104, 5–117, 6–132, 7–188, 8–191, 9–195, 10–200. 

బౌలింగ్‌: మష్రఫె మొర్తజా 7–0–37–0, ముస్తఫిజుర్‌ 8–1–32–2, సైఫుద్దీన్‌ 8–0–33–1, షకీబ్‌ 10–1–29–5, మెహదీ హసన్‌ మిరాజ్‌ 8–0–37–0, మొసద్దిక్‌ 6–0–25–1.   

2: ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా షకీబ్‌ అల్‌ హసన్‌ గుర్తింపు పొందాడు. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (5/31; 50 నాటౌట్‌) ఈ ఘనత సాధించాడు.  

1: ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు. ఒకే ప్రపంచకప్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు పది వికెట్లు కూడా తీసిన తొలి ప్లేయర్‌గా షకీబ్‌ గుర్తింపు పొందాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top