చెన్నై మ్యాచ్‌లపై నీలి నీడలు! | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: చెన్నై మ్యాచ్‌లపై నీలి నీడలు!

Published Fri, Apr 6 2018 12:42 PM

Ban IPL Matches in Chennai Till Cauvery Management  - Sakshi

సాక్షి, చెన్నై : చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కావేరీ జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని, వెంటనే  కావేరీ జలమండలి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో ఆ రాష్ట్ర ఎంపీలు సభ సజావుగా జరగకుండా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. అంతేకాకుండా చెన్నైలో ఐపీఎల్‌ను నిషేదించాలని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే) పార్టీ నేతలు ఏకంగా చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిలిపివేయాలని ఆ నగర పోలీస్‌ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కావేరి జలమండలి ఏర్పాటు చేసే వరకు మ్యాచ్‌లను నిలిపివేయాలని కోరామని, ఒక వేళ మ్యాచ్‌లు నిర్వహిస్తే అడ్డుకొని తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.దర్శకుడు భారతీరాజా అయితే ఐపీఎల్ ఓ పిచ్చి గేమ్ అని, ఐపీఎల్ మ్యాచ్‌లు తమిళులు ఏకం కావాల్సిన సమయంలో వారి ఐకమత్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు.

క్రీడా మైదానంలో సీట్లు నిండటం ముఖ్యం కాదని, ఆందోళనలో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుపై నిషేదం విధించడంతో గత రెండు సీజన్‌ల మ్యాచ్‌లకు చెన్నై అభిమానులు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొనడం అభిమానులను కలవర పెడుతోంది.

Advertisement
Advertisement