గోపీచంద్‌ అధికారాలకు కత్తెర? | BAI proposes to dissolve Pullela Gopichand's National Coach position | Sakshi
Sakshi News home page

గోపీచంద్‌ అధికారాలకు కత్తెర?

Jun 2 2017 12:07 AM | Updated on Sep 5 2017 12:34 PM

గోపీచంద్‌ అధికారాలకు కత్తెర?

గోపీచంద్‌ అధికారాలకు కత్తెర?

భారత బ్యాడ్మింటన్‌కు ఎన్నో అద్వితీయ విజయాలు అందించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అధికార పరిధిని తగ్గించే అవకాశం కనిపిస్తోంది.

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌కు ఎన్నో అద్వితీయ విజయాలు అందించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అధికార పరిధిని తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) నూతన అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ‘బాయ్‌’ నియామావళిలో పలు మార్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘జాతీయ చీఫ్‌ కోచ్‌’ అనే పదవిని తొలగించి, దాని స్థానంలో రెండేళ్ల పదవి కాలంతో జాతీయ కోచ్‌ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

దీంతో పాటు సింగిల్స్, డబుల్స్, జూనియర్స్‌ విభాగాలకూ ప్రత్యేకంగా వేరు వేరు కోచ్‌ల నియామకానికి ఆయన మొగ్గుచూపుతున్నారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం కోచ్‌లు మరే ఇతర రాష్ట్ర సంఘాలలో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. గోపీచంద్‌ 2006 నుంచి జాతీయ చీఫ్‌ కోచ్‌గా కొనసాగుతున్నారు. గోపీచంద్‌ పర్యవేక్షణలో ఇతర జాతీయ కోచ్‌లు పనిచేస్తున్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘానికి ఆయన కార్యదర్శి కూడా.

తాజా ప్రతిపాదనల ప్రకారం కోచ్‌ల బృందానికి ప్రత్యేక పర్యవేక్షణాధికారి ఉండరు. రాష్ట్ర సంఘంలోనూ ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ అంశంపై జూన్‌ 11న బెంగళూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు ఇన్‌స్టిట్యూషన్‌ జట్లు అయిన ఎయిరిండియా, పీఎస్‌పీబీ, రైల్వేస్, కాగ్, ఇంటర్‌ యూనివర్సిటీ కంట్రోల్‌ బోర్డులకు ఓటింగ్‌ హక్కును తొలగించాలని కూడా ప్రతిపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement