అయ్యో... జొకోవిచ్‌!   | Australian Open: Novak Djokovic Upset by Hyeon Chung | Sakshi
Sakshi News home page

అయ్యో... జొకోవిచ్‌!  

Jan 23 2018 12:10 AM | Updated on Jan 23 2018 12:10 AM

Australian Open: Novak Djokovic Upset by Hyeon Chung - Sakshi

కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు కొత్త ఏడాదీ కలిసి రాలేదు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ మాజీ విజేత ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. 21 ఏళ్ల కొరియా భవిష్యత్‌ తార హైన్‌ చుంగ్‌ అసమాన ఆటతీరుకు సెర్బియో యోధుడు తలవంచక తప్పలేదు. మూడేళ్ల క్రితం ఇదే వేదికపై తన ఆరాధ్య ఆటగాడి చేతిలో వరుస మూడు సెట్‌లలో ఓడిపోయిన చుంగ్‌ ఈసారి ఫలితాన్ని తారుమారు చేశాడు. జొకోవిచ్‌ను వరుస సెట్‌లలో మట్టికరిపించి తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న తొలి కొరియా ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. 

మెల్‌బోర్న్‌: ఎలాంటి అంచనాలు లేకుండా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అడుగు పెట్టిన అన్‌సీడెడ్‌ ఆటగాళ్లు హైన్‌ చుంగ్‌ (దక్షిణ కొరియా), టెనిస్‌ సాండ్‌గ్రెన్‌ (అమెరికా) సంచలనాల మోత మోగించారు. మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్, 14వ సీడ్‌ జొకోవిచ్‌ను హైన్‌ చుంగ్‌... ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను సాండ్‌గ్రెన్‌ బోల్తా కొట్టించి తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో చుంగ్‌ 3 గంటల 21 నిమిషాల్లో 7–6 (7/4), 7–5, 7–6 (7/3)తో జొకోవిచ్‌పై... సాండ్‌గ్రెన్‌ 3 గంటల 54 నిమిషాల్లో 6–2, 4–6, 7–6 (7/4), 6–7 (7/9), 6–3తో థీమ్‌పై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు.  సాండ్‌గ్రెన్‌ 20 ఏళ్లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ఆడిన తొలిసారే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన  రెండో ప్లేయర్‌గా నిలిచాడు.  ప్రపంచ 58వ ర్యాంకర్‌ చుంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఏకంగా తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. మూడు సెట్‌లలోనూ జొకోవిచ్‌ వరుసగా 0–4తో, 1–4తో, 1–3తో వెనుకబడ్డాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ,జొకోవిచ్‌కు గట్టిపోటీనిచ్చిన చుంగ్‌ కీలక దశలో పాయింట్లు రాబట్టి విజయాన్ని దక్కించుకున్నాడు. ‘రాకెట్‌ పట్టిన కొత్తలో నేను జొకోవిచ్‌ ఆటను అనుకరించేవాణ్ని. ఎందుకంటే అతను నాకు ఆరాధ్య ఆటగాడు. ఈ రోజు అతడినే ఓడించానంటే నమ్మశక్యంగా లేదు. అంతా కలలా ఉంది’ అని చుంగ్‌ మ్యాచ్‌ అనంతరం వ్యాఖ్యానించాడు.  

ఫెడరర్‌ జోరు: మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), 19వ సీడ్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) అలవోక విజయాలతో క్వార్టర్‌ ఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 7–6 (7/3), 6–2తో ఫక్సోవిక్స్‌ (హంగేరి)పై, బెర్డిచ్‌ 6–1, 6–4, 6–4తో ఫాగ్‌నిని (ఇటలీ)పై నెగ్గారు.  

హలెప్‌ అలవోకగా: మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6–3, 6–2తో ఒసాకా (జపాన్‌)పై సునాయాసంగా గెలుపొందగా... 17వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–3, 6–2తో ఎనిమిదో సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌)ను ఓడించింది. మాజీ చాంపియన్, 21వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 4–6, 7–5, 6–2తో సు వె సెయి (చైనీస్‌ తైపీ)పై, ఆరో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–7 (5/7), 6–3, 6–2తో 20వ సీడ్‌ బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరారు.  పోరాడి ఓడిన బోపన్న, దివిజ్‌ జోడీలు: పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో పదో సీడ్‌ రోహన్‌ బోపన్న (భారత్‌)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంట 4–6, 7–6 (7/5), 3–6తో ఏడో సీడ్‌ మరాచ్‌ (ఆస్ట్రియా)–పావిచ్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.  దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) ద్వయం 6–3, 6–7 (4/7), 4–6తో టాప్‌ సీడ్‌ మార్సెలో మెలో (బ్రెజిల్‌)–కుబోట్‌ (పోలాండ్‌) జంట చేతిలో పరాజయం పొందింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement